ఫీజు రియంబర్స్​మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమమే: ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి

by Ajay Maddhiboyina |

రాబోయే పది రోజుల్లో ప్రభుత్వం ఫీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం ఉధృతమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని, విద్యార్థుల ఆవేదనను తక్కువ అంచనా వేయకూడదని హితువు పలికారు.

ఫీజు రియంబర్స్​మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమమే: ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే పది రోజుల్లో ప్రభుత్వం ఫీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం ఉధృతమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని, విద్యార్థుల ఆవేదనను తక్కువ అంచనా వేయకూడదని హితువు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యావ్యవస్థ నాశనమవుతోంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఇప్పటివరకు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కళాశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్, నాన్-ప్రొఫెషనల్ విద్యాసంస్థలను సందర్శిస్తామన్నారు. విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి ఈ అంశాన్ని ఉద్యమంగా తీసుకెళ్తామని హెచ్చరించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. గ్రామాల్లో గంజాయి, పట్టణాల్లో డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల బారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు తప్పుదోవ పట్టే ప్రమాదం పెరుగుతోంది. అందుకే విద్యార్థులను సరైన మార్గంలో నడిపించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అత్యవసరంగా విడుదల చేయాలని కోరారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విద్యపై పెట్టుబడి పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టినట్లేనని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు చదువుకోవడం సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడి. బియ్యం, గ్యాస్, ఇతర సంక్షేమ పథకాలు ఒకరోజు ప్రయోజనం ఇస్తాయి. విద్యపై పెట్టుబడి పెడితే ఆ విద్యార్థి భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పౌరుడిగా ఎదుగుతాడు.

అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. రేవంత్​రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా, గత ప్రభుత్వానికి సంబంధించిన రెండు సంవత్సరాల బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన మూడు సంవత్సరాల బకాయిలు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటికీ విద్యార్థులకు విడుదల కాలేదన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్, నాన్-ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి చదువుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోంది. రీయింబర్స్‌మెంట్ నిలిచిపోవడంతో అనేక ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉన్నత విద్యా కళాశాలలు సగానికి సగం మూతపడే పరిస్థితి వచ్చింది. డ్రాప్‌అవుట్లు పెరుగుతున్నాయి. డ్రాప్‌అవుట్లు పెరగడం అంటే నిరక్షరాస్యత పెరగడమే. ఇది తెలంగాణ భవిష్యత్తుకు ప్రమాదకరమైన పరిస్థితి మారుతుందన్నారు.

Next Story