బయోమాస్ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం

by Batti.Sumithra |

మేళ్లచెరువు–చింతలపాలెం ప్రధాన రహదారి పై శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.

బయోమాస్ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, చింతలపాలెం : మేళ్లచెరువు–చింతలపాలెం ప్రధాన రహదారి పై శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. మేళ్లచెరువు సమీపంలో ఉన్న ఓ బయోమాస్ కంపెనీ పత్తి ఎండు ముక్కలను పౌడర్‌గా మార్చి ఉత్పత్తులు తయారు చేసే యూనిట్‌ను నిర్వహిస్తోంది. గత ఐదు నెలలుగా ఈ యూనిట్‌లో ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది. యూనిట్ ప్రాంగణంలో నిల్వ ఉంచిన పత్తి కట్టలు పూర్తిగా ఎండిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

గాలివేగానికి మంటలు వేగంగా వ్యాపించి భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగ రహదారిపై వ్యాపించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై రహదారిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, అయితే భారీ మొత్తంలో పత్తి నిల్వలు దగ్ధమైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు ఘటన పై విచారణ చేపట్టారు.

Next Story