- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్పెట్, బెడ్‌షీట్లను ఏకీకృత టెండర్ విధానం నుంచి తొలగించాలి
చేనేత సహకార సంఘాల నాయకుల ప్రకారం, గురుకులాలు మరియు ప్రభుత్వ కార్యాలయాల కోసం బెడ్‌షీట్లు, కార్పెట్లు వంటి వస్తువులను తెలంగాణ ప్రభుత్వం ఏకీకృత టెండర్ విధానంలో కొనుగోలు చేయడం వల్ల చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ప్రభుత్వ గురుకులాలతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే బెడ్‌షీట్లు, కార్పెట్లను తెలంగాణ ప్రభుత్వం ఏకీకృత టెండర్ విధానంలో కొనుగోలు చేయడం వల్ల చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని చేనేత సహకార సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వరంగల్‌లో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ చేనేత సహకార సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేనేత కార్మికులను ఆదుకునే ఉద్దేశంతో ఆప్కో ద్వారా నేరుగా సహకార సంఘాలకు కార్పెట్లు, బెడ్‌షీట్ల తయారీ బాధ్యతలు అప్పగించి ఉపాధి కల్పించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెస్కో ఆధ్వర్యంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని కొనసాగించి చేనేత సహకార సంఘాలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.
అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు బెడ్‌షీట్లు, కార్పెట్ల తయారీ బాధ్యతలు అప్పగించకుండా వాటిని ఏకీకృత టెండర్ విధానంలో చేర్చిందని, దీంతో తమకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖతో పాటు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, కార్పెట్లు, బెడ్‌షీట్లను ఏకీకృత టెండర్ విధానం నుంచి తొలగించి గతంలో మాదిరిగానే చేనేత సహకార సంఘాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ హామీని అమలు చేయకుండా ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. దీంతో ఈ అంశం పై హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు సైతం చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఏకీకృత టెండర్ విధానాన్నే కొనసాగిస్తూ తమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
దీనికి నిరసనగా శాంతియుత ఆందోళన చేపట్టామని తెలిపారు. చేనేత సహకార సంఘాల శాంతియుత నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజరై సంఘీభావం తెలిపారు. గత ప్రభుత్వాలు కార్పెట్లు, బెడ్‌షీట్ల తయారీ బాధ్యతలను చేనేత కార్మికులకు అప్పగించి ఉపాధి కల్పించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి జీవనోపాధి పై ప్రభావం చూపే విధంగా వాటిని ఏకీకృత టెండర్ విధానంలో చేర్చిందని విమర్శించారు. బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా కార్మికులకు సంఘీభావం తెలుపుతూ, ప్రభుత్వాల నిర్ణయాలు ఎల్లప్పుడూ కార్మికులకు ఉపాధి కల్పించేలా ఉండాలని, వారి జీవనోపాధిని దెబ్బతీసేలా ఉండకూడదని అన్నారు. ఈ నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పీడీ శ్రీనివాస్, ఆప్కో మాజీ డైరెక్టర్ దేవులపల్లి సత్యనారాయణమూర్తి తదితరులు కూడా కార్మికులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చేనేత కార్మికుల పక్షాన నిలిచి, బెడ్‌షీట్లు, కార్పెట్లను ఏకీకృత టెండర్ విధానం నుంచి తొలగించి వాటి తయారీ బాధ్యతలను చేనేత సహకార సంఘాలకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దయానంద చేనేత సహకార సంఘం పర్సనల్ ఇన్‌చార్జి వై. చిన్న భద్రయ్య, సహకార సంఘాల నాయకులు మసబత్తుల కుమారస్వామి, రాజేశం, కూలిపాక మధునయ్య, వెలిగెం రవిరాజు, సంపత్ తదితరులతో పాటు వివిధ సహకార సంఘాలకు చెందిన సుమారు 400 మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు.






