- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాణ్యమైన విత్తనాలే రైతులకు సరఫరా చేయాలి : మంత్రి సీతక్క
రానున్న వ్యవసాయకాలంలో నాణ్యమైన విత్తనాలే రైతులకు సరఫరా చేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : రానున్న వ్యవసాయకాలంలో నాణ్యమైన విత్తనాలే రైతులకు సరఫరా చేయాలని, నకిలీ విత్తనాలు అమ్మే వారి పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందే విధంగా సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విత్తన కంపెనీలు, డీలర్లు, ఆర్గనైజర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. విత్తనాల చట్టం ప్రకారం అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని, రైతులు నష్టపోతే అందరూ ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పట్టాలు లేని రైతులను గుర్తించి, వారికి సైతం ఎరువులు, విత్తనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల వారీగా పంటల విస్తీర్ణం, రైతుల సంఖ్య, అవసరమైన ఎరువుల పరిమాణం పై స్పష్టమైన వివరాలు సిద్ధం చేసి, ఎలాంటి కొరత తలెత్తకుండా పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలని వివరించారు.
అనంతరం మంత్రి జిల్లా ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి.సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, సంబంధిత అధికారులు, డీలర్లు, ఇంజనీరింగ్ అధికారులు, పాల్గొన్నారు.






