ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఆండ్రీవా.. పాత రికార్డ్స్ బద్దలు

by Muthe.Rajitha |

రష్యన్ టెన్నిస్ సంచలనం మిర్రా ఆండ్రీవా (Mirra Andreeva) 19 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మకమైన 2026 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఆండ్రీవా.. పాత రికార్డ్స్ బద్దలు
X

దిశ, వెబ్ డెస్క్ : టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త రికార్డు నమోదైంది. రష్యన్ టెన్నిస్ సంచలనం మిర్రా ఆండ్రీవా (Mirra Andreeva) 19 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మకమైన 2026 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. క్లే కోర్ట్ పై జరిగిన ఈ గ్రాండ్ స్లామ్ ఫైనల్ పోరులో 8వ సీడ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆండ్రీవా.. పోలాండ్ క్వాలిఫయర్ మాజా చ్వాలిన్స్కా (Maja Chwalinska)తో మ్యాచ్ ఆరంభం నుండి దూకుడు ప్రదర్శించి 6-3, 6-2 తో వరుస సెట్లలో ఘన విజయం సాధించి, తన కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ ట్రోఫీని ముద్దాడింది.

టోర్నీ మొత్తం ఆండ్రీవా హవా

ఈ అద్భుత విజయంతో మిర్రా ఆండ్రీవా టెన్నిస్ హిస్టరీలో అరుదైన రికార్డులు కొల్లగొట్టింది. 1992లో టెన్నిస్ దిగ్గజం మోనికా సెలెస్ తర్వాత.. రోలాండ్ గారోస్ క్లే కోర్టుపై ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న అత్యంత చిన్న వయసున్న ఛాంపియన్‌గా ఆండ్రీవా సరికొత్త రికార్డు నెలకొల్పింది. రెండు వారాల పాటు సాగిన ఈ సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఆండ్రీవా ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, మొత్తం టోర్నీలోనే కేవలం ఒకే ఒక్క సెట్ కోల్పోయిందంటే ఆమె చూపించిన తిరుగులేని ఆధిపత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

న్యూ సూపర్ స్టార్

ఫైనల్ మ్యాచ్‌లో క్వాలిఫయర్ మాజా చ్వాలిన్స్కా గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ, బేస్‌లైన్ నుండి ఆండ్రీవా సంధించిన పవర్‌ఫుల్ షాట్లు, ఆమె కోర్టు కవరేజ్ ముందు చ్వాలిన్స్కా ఆటలు సాగలేదు. కేవలం 19 ఏళ్ల ప్రాయంలోనే ఒత్తిడిని అధిగమించి, ప్రశాంతంగా ఆడుతూ గ్రాండ్ స్లామ్ గెలిచిన ఆండ్రీవా.. మహిళల టెన్నిస్ భవిష్యత్తుకు తానే సూపర్ స్టార్ అని నిరూపించుకుంది. ఈ సంచలన విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు, మాజీ క్రీడాకారులు ఆండ్రీవాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Next Story