వినియోగదారులకు గుడ్ న్యూస్.. వంటనూనెల ప్యాకేజింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు

by Muthe.Rajitha |

అన్నిరకాల వంట నూనెల ఉత్పత్తుల ప్యాకేజింగ్ పై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

వినియోగదారులకు గుడ్ న్యూస్.. వంటనూనెల ప్యాకేజింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు మరో ఊరటనిచ్చింది. అన్నిరకాల వంట నూనెల ఉత్పత్తుల ప్యాకేజింగ్ పై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అన్ని వంటనూనెల ప్యాకేజింగ్ నిర్దిష్ట పరిమాణంలో ఉండాలని కఠిన నిబంధనలు విధించింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న 650ml, 700ml, 850ml వంటి రకరకాల వింత పరిమాణాల వల్ల వినియోగదారులు ఏ బ్రాండ్ తక్కువ ధరకు వస్తుందో సులభంగా పోల్చుకోలేక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ మోసాలకు చెక్ పెడుతూ.. ధరలలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కేవలం 9 స్టాండర్డ్ సైజులను మాత్రమే మార్కెట్లో అనుమతించనుంది. గ్రామీణ ప్రాంతాల పేదల అవసరాల కోసం 200ml లేదా 200 గ్రాముల కంటే తక్కువ పరిమాణం ఉండే చిన్న సాషే (Sachets) ప్యాకెట్లకు మాత్రం ఈ నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు.

ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసిన ఈ 9 రకాల కొలతలలో, నిర్దిష్ట సైజులను మాత్రమే కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం మార్కెట్లో లభించే వంటనూనె ప్యాక్‌లు కేవలం 200మి.లీ/గ్రా, 500మి.లీ/గ్రా, లీటరు/కేజీ, రెండు లీటర్లు/కేజీలు, మూడు లీటర్లు/కేజీలు, నాలుగు లీటర్లు/కేజీలు, ఐదు లీటర్లు/కేజీలు, 15 లీటర్లు/కేజీలు, 20 లీటర్లు/కేజీల ప్యాకేజీలు మాత్రమే లభించనున్నాయి.

వినియోగదారులు విభిన్న బ్రాండ్ల మధ్య నూనె ధరలను, సైజులను సులభంగా పోల్చి చూసుకునేలా, కంపనీల మోసాల నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం వాల్యూమ్ (ml లేదా లీటర్లలో) కొలతలను ముద్రించే ప్రతి నూనె ప్యాకెట్ లేదా బాటిల్‌పై, దానికి సమానమైన నికర బరువును (గ్రాములు లేదా కేజీలలో) కూడా స్పష్టంగా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నూనె సాంద్రత ఆధారంగా కంపెనీలు చేసే వ్యాపార మోసాలకు పూర్తిగా అడ్డుకట్ట పడనుంది. ఈ సరికొత్త ప్యాకేజింగ్ విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి దేశీయంగా ఉన్న వంటనూనెల తయారీ కంపెనీలకు, ఇంపోర్టర్లకు కేంద్ర ప్రభుత్వం 90 రోజుల గడువును ఇచ్చింది.

Next Story