భారత్ లో బర్త్ రేట్ భారీగా పడిపోయింది : ఎలన్ మస్క్

by Muthe.Rajitha |

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ ఇటీవలి కాలంలో భారతదేశంలో పడిపోతున్న జననాల రేటు, సంతానోత్పత్తి రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

భారత్ లో బర్త్ రేట్ భారీగా పడిపోయింది : ఎలన్ మస్క్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్(Elon Musk) ఇటీవలి కాలంలో భారతదేశంలో పడిపోతున్న జననాల రేటు (Birth Rate), సంతానోత్పత్తి రేటు (TFR - Total Fertility Rate)పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. మానవ నాగరికత మనుగడకు ఇదొక పెద్ద హెచ్చరిక అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన ఓ డేటాను కూడా షేర్ చేసారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ "పాపులేషన్ కొలాప్స్" సంబంధించిన తాజా గణాంకాల వివరాలు చాలా స్పష్టమైన మార్పులను సూచిస్తున్నాయి.

తాజా గణాంకాల ప్రకారం.. జనాభా స్థిరంగా కొనసాగడానికి అవసరమైన ప్రామాణిక 'రీప్లేస్‌మెంట్ లెవెల్' 2.1 గా ఉండగా.. ప్రస్తుతం భారత్ లో మొట్టమొదటిసారిగా 1.9 కి పడిపోయింది. ఈ రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే చాలా కిందకు పడిపోవడం అనేది దేశ భవిష్యత్తు జనాభా ముఖచిత్రంలో రాబోయే అతిపెద్ద మార్పుకు సంకేతం. గత 10 సంవత్సరాల కాలంలోనే దేశీయంగా ఈ TFR రేటు 2.3 నుండి 1.9 కి వేగంగా పడిపోవడం గమనార్హం.

భారతదేశ వ్యాప్తంగా ఈ రేటును పరిశీలిస్తే రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ సంతానోత్పత్తి రేటు అత్యంత ఆందోళనకరంగా 1.4 నుండి 1.6 మధ్యకు పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇది ఏకంగా 1.2 కి క్షీణించింది. దీనికి భిన్నంగా ఉత్తర భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ రేటు రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే ఎక్కువగానే నమోదవుతోంది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సగటు రేటు పడిపోతుండటం వల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గి, వృద్ధుల జనాభా భారం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక, సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా ఎలన్ మస్క్ ఈ ప్రపంచవ్యాప్త ధోరణిని సుదీర్ఘ కాలంగా గమనిస్తూ.. జనాభా తగ్గిపోవడం అనేది మానవాళి ఎదుర్కొంటున్న 'క్లైమేట్ చేంజ్' కంటే వంద రెట్లు పెద్ద సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది జనాభా విస్ఫోటనం(Overpopulation) గురించి భయపడుతుంటారు, కానీ ప్రపంచం పాపులేషన్ కొలాప్స్ వైపు వెళ్తోందని ఆయన హెచ్చరించారు. పిల్లలను కనడం తగ్గించడం వల్ల భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా శ్రామిక శక్తి (Labor Force) కొరత ఏర్పడుతుందని, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయని మస్క్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పదే పదే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు.

Next Story