- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ జాతి అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పుకోవాలి : కేటీఆర్ పిలుపు
రాష్ట్రంలోని పరిస్ధితులు ఏమి తెలియని నాలుగు ఫీట్లు ఉన్న నాయకులు తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

- కాలనాగులతో జాగ్రత్త 2028లో మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే
- రాష్ట్ర భవిష్యత్తుకు బీఆర్‌ఎస్‌కు మాత్రమే విజన్ ఉంది
- తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస బిడ్డలు కలిసిరావాలి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పరిస్ధితులు ఏమి తెలియని నాలుగు ఫీట్లు ఉన్న నాయకులు తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసకొడతాయని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కె. తారక రామారావు పేర్కొన్నారు. అలాంటి విషనాగులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 2028లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం మలేషియా తెలుగు అసోసియేషన్, బీఆర్‌ఎస్ ఎన్నారై మలేషియా శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తమ మాతృభూమిని మర్చిపోకుండా ఆవిర్భావ సంబరాలు చేసుకుంటున్న ఎన్నారైలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్న ఊరును, కన్న తల్లిని మర్చిపోకుండా ఖండాలు దాటినా తెలంగాణ తల్లిని తలుచుకుంటూ ఆవిర్భావ దినోత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. వేల సంవత్సరాల కిందట మొదలైన తెలంగాణ చరిత్ర రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు, సంస్కృతి, పాటలతో తరతరాలుగా విలసిల్లుతున్నదన్నారు. తెలంగాణ జాతిలో ప్రతి తరం ఏదో ఒక యుద్ధాన్ని, రణాన్ని నడిపించిందని గుర్తుచేశారు. ప్రకృతితో మమేకమై బతుకమ్మను జరుపుకునే, పువ్వులను పూజించి ప్రకృతిని ఆరాధించే ఒకే ఒక్క జాతి ఈ ప్రపంచంలో తెలంగాణ జాతి అని స్పష్టం చేశారు. ఇంత అద్భుతమైన చరిత్ర, సంస్కృతి కలిగిన మనందరం నాది తెలంగాణ, నాది తెలంగాణ జాతి, నేను తెలంగాణ బిడ్డను అని సగర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. మలి విడత ఉద్యమానికి నాయకత్వం వహించి, సబ్బండ వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళిన కేసీఆర్ నాయకత్వంలో పుష్కరానికి పైగా సాగిన ప్రజాస్వామిక ఉద్యమం వల్లనే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందన్నారు. భారతదేశంలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ సైతం అత్యంత తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు. ఒకనాటి వలసల తెలంగాణను, కరువుల తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. మలేషియా మాదిరే తెలంగాణలోనూ పామాయిల్ విప్లవం సాధించి, రైతన్నల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఏకైక ఉద్దేశంతో పామాయిల్ కోసం మలేషియా నుంచి విత్తనాలు, మొక్కలు తీసుకువచ్చి తెలంగాణలో నాటించిన అంశాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందన్నారు.
ప్రజలకు స్వచ్చమైన మంచినీరు సరఫరా బీఆర్ఎస్ప్రధాన విజన్
60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో తల్లడిల్లిన తెలంగాణకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అన్ని రంగాలకు అందించిన తీరుగానే రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా 24 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీటిని నిరంతరం సరఫరా చేయాలన్నదే తమ ప్రధాన విజన్ అని ప్రకటించారు. దీనితో పాటు ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలో నిలిపే శక్తి కేసీఆర్ గారికే ఉన్నదని, కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రాగానే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో విపరీతమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో, ప్రవాస భారతీయులు స్థానికులతో కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. స్థానికులతో, స్థానిక సంస్కృతితో కలిసి ముందుకు పోతే ప్రతి దేశంలోనూ తెలంగాణ బిడ్డలు అద్భుతమైన విజయాలు సాధిస్తారన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులంతా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. మలేషియాలో ఈ అద్భుతమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్ తో పాటు బీఆర్‌ఎస్ ఎన్నారై మలేషియా శాఖకు, పార్టీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






