‘నీట్’ హిస్టరీలో ఫస్ట్ టైమ్: ఐఏఎఫ్ యుద్ధ విమానాల్లో క్వశ్చన్ పేపర్లు

by Vemula.Srinu Prasad |

ఈ నెల 21న దేశవ్యాప్తంగా జరగనున్న నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను రాష్ట్రంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు..

‘నీట్’ హిస్టరీలో ఫస్ట్ టైమ్: ఐఏఎఫ్ యుద్ధ విమానాల్లో క్వశ్చన్ పేపర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 21న దేశవ్యాప్తంగా జరగనున్న నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను రాష్ట్రంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో నీట్ పరీక్ష ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోళ్లు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జోంగ్తూ సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రంలోని 24 నగరాల్లో ఏర్పాటు చేసిన 208 కేంద్రాల్లో దాదాపు 72,956 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద రవాణా, నిరంతర విద్యుత్, తాగునీరు, వైద్యాధికారుల బృందం వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు.

తొలిసారిగా విమానాల ద్వారా నీట్ ప్రశ్నాపత్రాలు

ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ ఈసారి నీట్ పరీక్షల భద్రతను మరింత కఠినతరం చేశామని వెల్లడించారు. పరీక్షల సమగ్రతను కాపాడేందుకు తొలిసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) సేవలతో విమానాలు, హెలిక్యాప్టర్ల ద్వారా ప్రశ్నాపత్రాలను రవాణా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదనపు డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పుకార్లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

వర్ష సూచన.. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు

రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని... ఇంకా నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో, కలెక్టర్లు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. సీఎం బహిరంగ సభలు, భద్రత, రవాణా, వసతి వంటి లాజిస్టిక్ ఏర్పాట్లను ముందస్తుగానే పక్కాగా పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సెర్ప్ సీఈఓ దివ్య, సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story