- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైరవీలు చేస్తే.. వేటు తప్పదు : అడిషినల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్
తెలంగాణ స్పెషల్ పోలీస్ టీజీఎస్పీ విభాగం నుంచి ఇతర ప్రత్యేక విభాగాలకు డిప్యుటేషన్‌పై వెళ్లే పోలీసు అధికారుల కోసం రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలు తీసుకొచ్చింది.

- టీజీఎస్పీ పోలీసుల డిప్యుటేషన్లకు మార్గదర్శకాలు
- కానిస్టేబుల్ నుంచి ఆర్‌ఐ వరకు వర్తించేలా మెమో జారీ
- సర్వీసులో గరిష్ఠంగా పదేళ్లు మాత్రమే అవకాశం
- గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సీబీఐ తదితర విభాగాలకు బదిలీల కోసం కొత్త రూల్స్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్పెషల్ పోలీస్ టీజీఎస్పీ విభాగం నుంచి ఇతర ప్రత్యేక విభాగాలకు డిప్యుటేషన్‌పై వెళ్లే పోలీసు అధికారుల కోసం రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ బదిలీల కోసం ఎవరైనా నాయకులతో రాజకీయ పైరవీలు చేసినా, ఉన్నతాధికారులపై ఇతర మార్గాల్లో ఒత్తిళ్లు తీసుకొచ్చినా వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీ అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ హెచ్చరించారు. ఈ మేరకు పోలీసు కానిస్టేబుల్ నుంచి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల డిప్యుటేషన్లను క్రమబద్ధీకరిస్తూ సమగ్ర మార్గదర్శకాలతో కూడిన మెమోను జారీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు.. సీబీఐ,విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, జెన్‌కో లాంటి విభాగాలకు వెళ్లేవారికి ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని అయన స్పష్టం చేశారు.
డిప్యుటేషన్‌పై వెళ్లాలనుకుంటే..
దరఖాస్తు చేసుకునే సమయానికి, ప్రస్తుతం ఉన్న హోదాలో కనీసం రెండేళ్లు పనిచేసి ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన వారైతే ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకోవాలి.
ఒకసారి డిప్యుటేషన్ పూర్తయ్యాక, మరో డిప్యుటేషన్‌కు వెళ్లాలంటే మధ్యలో కచ్చితంగా మూడేళ్ల పాటు టీజీఎస్పీ కూలింగ్ పీరియడ్ లో పనిచేయాలి. తమ మొత్తం సర్వీసు కాలంలో డిప్యుటేషన్‌పై పదేళ్లకు మించి పనిచేయడానికి వీల్లేదు. మరో ఆరు నెలల్లో పదవీ విరమణ ఉన్న వారికి అవకాశం లేదు. దరఖాస్తుదారుడిపై ఎలాంటి క్రిమినల్, డిసిప్లినరీ కేసులు పెండింగ్‌లో ఉండకూడదు. టీజీసీఎస్ రూల్స్ ప్రకారం ఎలాంటి మేజర్ పెనాల్టీలు పడి ఉండకూడదు.
ఎంపిక విధానం.. కమాండెంట్లదే బాధ్యత..
అర్హత, ఆసక్తి ఉన్న సిబ్బంది నుంచి బెటాలియన్ల కమాండెంట్లు దరఖాస్తులు స్వీకరించాలి. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ విభాగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం అర్హులైన వారి జాబితాను సీనియారిటీ ఆధారంగా కమాండెంట్లు తయారుచేసి టీజీఎస్పీ హెడ్ క్వార్టర్స్‌కు పంపాలి. ఒకవేళ ఎవరినైనా కమాండెంట్లు పంపించడానికి నిరాకరిస్తే.. ఆ సిబ్బంది సేవలు బెటాలియన్‌కు ఎందుకు అవసరమో స్పష్టమైన కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
కోటాకు మించి పంపేది లేదు..
డిప్యుటేషన్‌కు సంబంధించిన ప్రాథమిక గడువు మూడేళ్లు మాత్రమే ఉంటుంది. ఆయా విభాగాల నుంచి వచ్చే ఖాళీల అభ్యర్థన మేరకు టీజీఎస్పీ హెడ్‌క్వార్టర్స్ ఈ బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏ విభాగానికి ఎంత కోటా నిర్ణయించారో ఆ మేరకే సిబ్బందిని పంపుతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ కోటా పరిమితిని మించే ప్రసక్తే లేదని అదనపు డీజీపీ జారీ చేసిన మెమోలో స్పష్టం చేశారు.






