మన్యంలో అక్రమ చిట్టీలు

by  |
మన్యంలో అక్రమ చిట్టీలు
X

దిశ భద్రాచలం: మన్యంలో అనుమతిలేని చిట్స్, ఫైనాన్స్ వ్యాపారం జోరుగా నడుస్తోంది. గతంలో మాదిరిగా పోలీసులు చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులపై ప్రత్యేక దృష్టిపెట్టి వారిని కట్టడి చేయకపోవడంతో ఇక తమకు అడ్డేముంది అన్నట్లుగా ఏజెన్సీలో రిజిస్ట్రేషన్‌లేని చిట్స్ నిర్వాహకులు, ఫైనాన్స్ వ్యాపారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చిట్స్ నిర్వహణ ఈజీగా డబ్బులు సంపాదించే మార్గంగా తయారైంది. కేవలం సంఘంలో పలుకుబడి, పరిచయాలే పెట్టుబడిగా మనీ రొటేషన్ చక్రవర్తులకు చిట్స్ రూపంలో డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. పైసా పెట్టుబడి లేకుండా కేవలం జనం డబ్బులతో చిట్టీలు నడుపుతున్న నిర్వాహకులు చూస్తుండగానే కండ్ల ముందు కుబేరులు అవుతుంటే ఆర్థిక అవసరాల కోసం చిట్టీలు వేసి అవసరాలకు పాడుకొన్నవారు వడ్డీ నష్టపోయి అప్పులపాలు అవుతున్నారు.

చిరు వ్యాపారులే చిట్స్‌కి మూలం

చిట్టీలు వేస్తే వ్యాపార అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశ్యంతో ఎక్కువగా చిరువ్యాపారులే చిట్టీలలో సభ్యులుగా చేరుతారు. చిట్టీల్లో సభ్యులే నిర్వాహకుల ఆదాయ వనరు అనడం అతిశయోక్తికాదు. ఇలా చిరు వ్యాపారుల మీద ఆధారపడి డబ్బులు సంపాదించే చిట్టీ నిర్వాహకులే చివరకు సభ్యులను ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తుంది. చిట్టీ ఎమౌంట్ కట్టడం కాసింత లేటైనా చిట్టీల నిర్వాహకులు జనం ముందు హేళనగా మాట్లాడి పరువు తీస్తుంటారని పాటదారులు భయపడతారు. ఎంత చిట్టీ వేస్తే నిర్వాహకులకు అంత లాభం ఉంటుంది. ఉదా : లక్ష రూపాయల చిట్టీలో 20 మంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరు నెలకి ఐదు వేలు చెల్లించాలి. అయితే పైసా కట్టకుండా చిట్టీ నిర్వాహకులు ఒక పాట లక్ష రూపాయలు తీసుకొంటారు. ఇలా ఒక్కొక్కరు వారం, నెల చిట్టీలతో నెలకి లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదించేవారు మన్యంలో లేకపోలేదు. ఇదంతా చిట్టీ నిర్వాహకులకు వచ్చే ఉచిత ఆదాయమని చెప్పవచ్చు.

ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు

చిట్టీ చివరి వరకు పాడుకోకుండా ఉంటే తప్ప చిట్టీల వలన సభ్యులకు పెద్దగా ఆర్థిక లాభం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. షెడ్యూల్డ్ ప్రాంతంలో చిట్టీల నిర్వహణకు అనుమతి లేనప్పటికీ బాగా డబ్బు సంపాదించే మార్గం కావడంతో చిట్స్‌ నిర్వాహకులు పుట్టుకొస్తున్నారు.‌ ముందుగా చిట్టీలు పాడుకున్న వారి దగ్గర కొందరు చిట్స్ నిర్వాహకులు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించి భద్ర పర్చుకొంటున్నట్లు తెలుస్తోంది.‌ ఇదేమిటని ప్రశ్నిస్తే ముందుచూపు అని చెబుతున్నారని చిట్స్ సభ్యులు తెలిపారు.

తమ దగ్గర గ్యారంటీ తీసుకొనే చిట్స్ నిర్వాహకులు తమకేమి గ్యారంటి ఇస్తారని అడిగితే నమ్మకం ఉంటే చేరండి. లేదంటే మానేయండి అనే సమాధానం వినిపిస్తోంది. చిట్స్ నడిపి మధ్యలో అర్దాంతరంగా చిట్టీలు క్లోజ్ చేసి సభ్యులకు డబ్బులు చెల్లించకుండా చేతులెత్తేసినవారు కోకొల్లలు. ఇది లాభసాటిగా ఉండటంతో కొందరు ఐదు నుంచి పది చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గజిటెడ్ అధికారికి జీతానికి మించిన ఆదాయం ప్రతినెలా చిట్స్ నిర్వాహకులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో చిట్స్ మధ్యలో మానేస్తే తిరిగి డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టి నిర్వాహకులే బెదిరింపులకు పాల్పడుతుంటారనే ఆరోపణలు లేకపోలేదు. ఏజెన్సీలో విచ్చలవిడిగా జరిగే చిట్స్‌పై పోలీసులు దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed