ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకగ్రీవాలే ఎక్కువ

by  |
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకగ్రీవాలే ఎక్కువ
X

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా మొదటి ఘట్టం పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకుని ఉపసంహరణ వరకు ఉత్కంఠ నెలకొంది. ఏకగ్రీవాలను చేసుకుని ఎక్కువ మంది డైరెక్టర్లతో ఉమ్మడి జిల్లాలో అధిక సంఖ్యలో సహకార సంఘాలను గెలుచుకునే దిశలో అడుగులు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో 89 సొసైటీలకు గాను 26 సొసైటీలు ఏకగ్రీవం అయ్యాయి. 1157 డైరెక్టర్‌ల పోస్టులకు గాను 677 పోస్టులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 63 సొసైటీలలో 480 డైరెక్టర్‌ల పోస్టులకు గాను 1055 మంది బరిలో నిలిచారు.కామారెడ్డి జిల్లాలో 55 సొసైటీలకు గాను నామినేషన్‌ల ఉపసంహరణ జరిగిన సోమవారం వరకు 12 సొసైటీలు ఏకగ్రీవం అయ్యాయి. 713 డైరెక్టర్ల పదవులకు గాను 367 పోస్టులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 43 సొసైటీలలో 346 డైరెక్టర్ల పోస్టులకు గాను 834 మంది బరిలో నిలిచారు.

ఉమ్మడి జిల్లాలలో 144 సహకార సంఘాలు ఉన్నాయి. అక్కడ గెలిచిన సింగిల్ విండో చైర్మెన్లు డీసీసీబీ కోసం 17 మంది డైరెక్టర్లుగా, డీసీఎంఎస్ కోసం 9 డైరెక్టర్‌లను పాలక వర్గాలను ఎన్నుకుంటారు. ఈ నెల 15 న జరిగే ఎన్నికలలో ప్రాథమిక సహకార సంఘాల సభ్యులుగా ఉన్న ఓటర్లు సొసైటీల అధినేతలను, డైరెక్టర్‌లను ఎన్నుకోనున్నారు. అదే రోజు సాయంత్రం వరకు పాలక వర్గాల ఎన్నిక జరుగనుంది.

డీసీసీబీ ఛైర్మన్ బరీలో స్పీకర్ సన్

ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న సహకార సంఘాల ఎన్నికలలో డీసీసీబీ చైర్మెన్ రేసులో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా సొసైటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. స్పీకర్ సొంత నియోజకవర్గంలోని తన సొంత గ్రామ పరిధిలోని దేశాయ్ పేట్ సింగిల్ విండో చైర్మెన్‌గా ఏకగ్రీవంగా రెండో సారి భాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. గడిచిన సహకార ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు రావడంతో అప్పుడు భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మెన్ కాలేకపోయారు. అయితే, తెలంగాణ రాష్ర్టంలో తోలి ప్రభుత్వంలో వ్యవసాయశాఖ, సహకార శాఖలను నిర్వహించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండో సారి శాసనసభాపతిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అ అసెంబ్లీ ఎన్నికలలో తనకు బదులు తనయుడికి టికెట్ కోరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరికను కేసీఆర్ నిరాకరించినా సహకార జిల్లా చైర్మెన్ గిరిని మాత్రం కన్‌ఫార్మ్ చేశారని జిల్లాలో చర్చ జరుగుతుంది. ఉమ్మడి రాష్ర్టంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి దేశాయిపేట్ సింగిల్ విండో చైర్మెన్‌గా గెలిచి డీసీసీబీ చైర్మెన్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం.

Next Story