నాన్నకు ప్రేమతో.. హైదరాబాద్ to కశ్మీర్ సైకిల్ యాత్ర

by  |
Ranjith, Bicycle trip
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ టూ కాశ్మీర్ సుమారు 3 వేల 500 కిలో మీటర్ల జర్నీ.. బస్సులో వెళ్లాలంటేనే రోజులు పడుతోంది. అలాంటిది ఒక్కడే సైకిల్ పై వెళ్తే ఎలా ఉంటుంది. కానీ, నాన్నకు నివాళిగా, కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ.. రోజుల తరబడి సైకిల్ తొక్కుతూ ఒంటరిగానే భాగ్యనగరం నుండి కాశ్మీర్ వరకు వెళ్లి వచ్చాడు ఓ యువకుడు. రంజిత్ ఆన్ వీల్స్ సాగించిన సైకిల్ యాత్ర విశేషాలు, దారి వెంట ఆయన అనుభవాలు, చూసిన ప్రదేశాలు ‘దిశ’ పాఠకుల కోసం..

Ranjith, Bicycle trip

నాన్న కోసం..

చిన్నపట్టి నుంచి అల్లారు ముద్దుగా పెంచాడు. ఊహ తెలిసిన నాటి నుండి అన్నీ తానై ప్రపంచాన్ని పరిచయం చేసి దిక్సూచి నిలిచాడు. చివరకు కరోనా రక్కసికి అసువులు బాసాడు. దీంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన రంజిత్ అందులో నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశాడు. తన తండ్రిలా కరోనా మహమ్మారికి బలవుతున్న ఎందరినో దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, తన నాన్నకు నివాళిగా ‘సైకిల్ యాత్ర’ చేపట్టారు.

అలా మొదలైన సైకిల్ టూర్..

కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ హైదరాబాద్‌లో మొదలైన రంజిత్ సైకిల్ టూర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఇలా దాదాపు 14 రాష్ట్రాలను చుట్టేస్తూ.. కశ్మీర్ వరకు సాగిపోయారు. ఇలా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 38 రోజుల పాటు ఒక్కడే సైకిల్ పై నిర్విరామంగా ప్రయాణించారు. దారిపొడుగునా ఎన్నో అవాంతరాలు ఎదురైనా తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. అలాగే మనాలి నుండి గోవా మీదుగా లద్దాఖ్ వెళ్లారు. అలవాటు లేని అక్కడి వాతావరణాన్ని తట్టుకుంటూ సైకిల్ పై అసాధ్యమనుకున్న ప్రయాణాన్ని సుసాధ్యం చేశారు.

అడుగడుగునా జనాదరణ..

సైకిల్ యాత్ర సాగుతుండగా ఆయా రాష్ట్రాల్లో ప్రజలు చూపిన అభిమానం, ప్రేమను తానెప్పుడూ మర్చిపోలేనంటున్నారు రంజిత్. సైకిల్‌పై వెళుతుంటే ఒకరు భోజనం పెడితే మరొకరు దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చారని, ఇంకొందరు బస చేసేందుకు చోటు ఇచ్చి తనను ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. వెళ్లిన ప్రతీచోట, ప్రతీ రాష్ట్రంలో తమవాడిగా చూసుకున్నారని, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటో కళ్లారా చూశానని, అవకాశం ఉంటే మరోసారి సైకిల్ టూర్ చేస్తానని రంజిత్ అన్నారు.

భిన్న సంస్కృతులు.. విభిన్న వాతావరణాలు..

రంజిత్ సైకిల్ యాత్ర మొదలు పెట్టే నాటికి ఎలాంటి రోడ్డు మ్యాప్ లేదు. తనను గైడ్ చేసేవారూ లేరు. అయినా ఒకే ఒక్క సంకల్పం తన నాన్నకు ఘన నివాళి అర్పించాలి. కోవిడ్ పై అవగాహన కల్పించాలి అనే ఉద్దేశ్యంతో బయలుదేరిన రంజిత్‌కు దారిపొడుగునా ప్రజల నుండి లభించిన మద్దతుతో ముందుకు సాగిపోయారు. మార్గం మధ్యలో కొవిడ్ సమయంలో విశిష్ట సేవలు అందించిన రియల్ హీరో సోనూసూద్‌ను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అలాగే కర్ణాటకలో ఐపీఎస్‌ల శిక్షణ శిబిరానికి స్పెషల్ గెస్ట్‌గా పిలిచి తనతో మోటివేషన్ స్పీచ్ ఇప్పించడం తనకు మర్చిపోలేని గుర్తింపు అని సంతోషం వ్యక్తం చేశారు. సైకిల్ జర్నీ వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని, ఎప్పుడూ హెల్తీగా ఉంటారని, మధుమేహం, గుండె జబ్బులు రావని అందరికీ తెలిసిందే కానీ సైకిల్ జర్నీ వల్లే నాకు ఇవాళ ఎంతో గుర్తింపు లభిస్తుందని, రంజిత్ ఆన్ వీల్ అనే నేమ్ చాలామందికి చాలా రాష్ట్రాల్లో సుపరిచితం అయిందని అన్నారు రంజిత్.

ఎన్నో సన్మానాలు.. మరెన్నో అభినందనలు..

హైదరాబాద్ టూ కాశ్మీర్ వరకు సుమారు 3500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన రంజిత్‌ను ఎందరో ప్రముఖులు అభినందించారు. ముఖ్యంగా హీరో సోనూసూద్ ప్రశంస తనకెంతో స్పెషల్ అంటారు రంజిత్. అలాగే ఆయా రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, సైక్లిస్ట్‌లు, పొలిటీషియన్స్ ఇలా ఎంతో మంది ఘనంగా సన్మానించారు.

హన్మకొండ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వరంగల్ సీపీ డా.తరుణ్ జోషీ, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ రంజిత్ ఆన్ వీల్‌ను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ఘనంగా సన్మానించారు.

ఆరోగ్యానికి సైక్లింగ్ బెస్ట్.. రంజిత్

సైకిల్ తొక్కడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని, స్థూలకాయం, షుగర్, బీపీ, గుండెనొప్పి లాంటి వ్యాధులు దరిచేరవని ప్రతీఒక్కరూ సైకిల్ తొక్కలని అంటున్నారు రంజిత్. ప్రభుత్వం కూడాప్రత్యేకంగా సైకిల్ ట్రాక్ లు డెవలప్ చేయడంతో పాటు సైక్లింగ్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed