బంజరు భూమిలో సేద్యం.. సాధ్యం చేసిన విద్యార్థులు

by  |
బంజరు భూమిలో సేద్యం.. సాధ్యం చేసిన విద్యార్థులు
X

దిశ, ఫీచర్స్: ‘తినేవాళ్లు మన నెత్తి మీద జుట్టంత ఉంటే, పండించే వాళ్లు మూతి మీద మీసమంత కూడా లేరు’.. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఓ సినిమాలోని డైలాగ్ ఇది. నిజానికి ఇది సినిమా డైలాగే అయినా దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. వ్యవసాయాన్ని ఓ ప్రొఫెషన్‌గా ఎంచుకునే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ఓ డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని, ఓ యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలని కోరుకుంటున్నట్టుగా.. ఓ రైతు కొడుకు మాత్రం ఎందుకు రైతుగా మారాలని అనుకోవడం లేదు? అందుకు గల ప్రతికూతలేంటి? తదితర సమస్యలకు పరిష్కారం చూపుతూ, సాగులో నూతన ఒరవడులకు ‘శ్రీకారం’ చుట్టే నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ఈ మూవీ హీరో మాదిరిగానే ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నాడు. సాగును లాభాల బాట పట్టించేందుకు తన స్థాయిలో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే 70 ఎకరాల బంజరు భూమిని సాగులోకి తెచ్చి శభాష్ అనిపించుకున్నాడు. ఓ బాధ్యతాయుత ఉద్యోగంలో కొనసాగుతూనే, ఆయన ఇదంతా ఎలా చేయగలుగుతున్నాడు? తన స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు, వ్యవసాయానికి సంబంధమేంటి? మీరూ తెలుసుకోండి.

సాధారణంగా స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌ను ఎలా చేయాలనుకుంటారు? పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, స్థానిక రాజకీయ నాయకులు లేదా ప్రముఖులను గెస్టులుగా ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు, అతిథుల మోటివేషనల్ స్పీచెస్.. ఆ తర్వాత కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ కర్ణాటకలోని ‘ఉడుపి నిట్టుర్ హై స్కూల్’ హెడ్‌మాస్టర్ మురళి కదేకర్ మాత్రం అలా ఆలోచించలేదు. సెలబ్రేషన్స్ యూనిక్‌గా ఉండాలనుకున్నాడు. అదే టైమ్‌లో ఏదో ఒక సాదాసీదా స్కూల్ ఫంక్షన్‌లా ఒక్క పూటలో ముగియకుండా.. ఓ మార్పునకు శ్రీకారం చుట్టేలా, సొసైటీలో డిఫరెన్స్ క్రియేట్ చేసేలా ఉండాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది జులైలో ఆ స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని చర్చించుకుంటున్న క్రమంలో, స్కూల్‌కు చుట్టుపక్కల గల బంజరు భూమిని ‘సాగు’లోకి తీసుకురావాలనే ఆలోచన తట్టింది.

మూడు దశాబ్దాల కిందట నేను టీచింగ్ కెరీర్ స్టార్ట్ చేసినపుడు.. పచ్చని పొలాల మధ్య నుంచి సైకిల్‌పై పాఠశాలకు వచ్చిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కాలక్రమంలో పచ్చని పొలాలన్నీ పనికిరాని బీడు భూములుగా మారిపోయాయి. ఇందుకు కారణాలేవైనా, నా స్థాయిలో వాటిని పునరుద్ధరించాలని అనుకున్నా. పాఠశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌‌ను ఇందులో భాగం చేయాలని భావించా.
– మురళి, హెడ్‌మాస్టర్

40 మంది పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులు ఇతరులతో తన ఆలోచనను పంచుకున్న మురళి.. ‘హదిలుగద్దె బెసయా(Hadilugadde Besaya)’ పేరిట క్యాంపెయిన్ షురూ చేశారు. కన్నడ వాక్యం ‘హదిలుగద్దె బెసయా’ అంటే.. బీడు భూములను తిరిగి సాగు చేయడం. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా రైతులకు తిరిగి తమ భూములను సాగు చేసుకోవడంపై అవగాహన కల్పించారు. అయితే తమకు అప్పులున్నాయని, పెట్టుబడికి డబ్బులు లేవని, భూమిలో ప్లాస్టిక్ చెత్త పేరుకుపోయిందన్న కారణాలతో పలువురు రైతులు ముందుగా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో స్కూల్ చుట్టుపక్కల ఉన్న ఐదు జోన్లు ‘కరంబల్లి, పెరంపల్లి, కక్కుంజె, నిట్టుర్, పుత్తూర్‌’లోని రైతులతో ‘హదిలుగద్దె బెసయా’ బృంద సభ్యులు మీటింగ్స్ నిర్వహించగా కొందరు రైతులు ఒప్పుకున్నారు. కాగా ప్రతీ జోన్‌కు ఒకరి చొప్పున స్కూల్‌ పూర్వ విద్యార్థులను ‘అసిస్టెంట్ వారియర్స్’గా నియమించారు. అయితే ఇక్కడ మరో సమస్య తలెత్తింది. ఈ జోన్లలో బంజరు భూములున్న చాలామంది సీనియర్ సిటిజన్లకు తమ భూములను తిరిగి సాగులోకి తీసుకురావడం ఇష్టం లేదు. వారి పిల్లలు కూడా అగ్రికల్చర్ ఫీల్డ్‌లో తాము ఇన్వెస్ట్ చేయలేమని చెప్పారు. ఈ క్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ భాస్కర సువర్ణ, నలుగురు పూర్వ విద్యార్థులు ‘దినేష్ పూజారి, రంజన్ శెట్టి, హరీశ్ ఆచార్య, సుధాకర్ కొంట్యాన్’లు ఇతర క్యాంపెయిన్ సభ్యులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించి చివరకు పలువురిని ఒప్పించారు.

బీడు భూముల సాగు కోసం మురళి నేతృత్వంలో బృంద సభ్యులు రూ.14 లక్షలు విరాళాలు సేకరించి పనులు మొదలు పెట్టారు. సాధ్యమైనంత వరకు రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలోనే సాగు పనులు చేపట్టారు. ఫీల్డ్ వర్క్‌లో ఎక్స్‌పీరియెన్స్ లేని వారు ఎలా చేయాలో తెలుసుకుని మరీ చేశారు. ఈ క్రమంలో సాగు పనుల్లో భాగమైన 300 మంది స్కూల్ విద్యార్థులు.. వరి పంట ఎలా పండుతుందో ప్రాక్టికల్‌గా తెలుసుకోగలిగారు. ఈ క్రమంలో బట్టీ చదువులకే పరిమితమవుతున్న విద్యార్థులకు తమ ప్రోగ్రామ్ ద్వారా అగ్రికల్చర్ రియాలిటీ ప్లస్ ఇంపార్టెన్స్ పరిచయం చేశారు హెడ్ మాస్టర్ మురళి. అంతేకాదు పంటసాగు కోసం భూమి ఇచ్చిన ప్రతీ రైతుకు మురళి బృంద సభ్యులు 10 కేజీల ఆర్గానిక్ రైస్ ఇచ్చారు. కాగా ఈ వ్యవసాయ క్షేత్రంలో పండిన పంట ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉందని, తమ కష్టానికి ప్రతిఫలం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మురళి ఉపాధ్యాయుడిగా ఉంటూనే.. ‘యక్షగాన కళారంగ’ అనే సంస్థలో 16 ఏళ్ల నుంచి గౌరవ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తోంది. ఇక మురళి తన రిటైర్‌మెంట్ గ్రాట్యుటీతో నిర్మించుకున్న ఇంటిని కూడా అణగారిన వర్గానికి చెందిన ఓ విద్యార్థికి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. కాగా 59 ఏళ్ల ఈ హెడ్ మాస్టర్ గారి ‘సాగు’ ఆలోచన నేడు సాకారమవుతున్నది. తన పాఠశాలకు చుట్టుపక్కల ఉన్న 70 ఎకరాల బీడు భూమి నేడు సస్యశ్యామలమైంది. బంజరు భూమిలో 27 టన్నుల వరి ధాన్యాన్ని పండించి స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసిన హెడ్ మాస్టర్ మురళి నిజంగా భావితరాలకు స్ఫూర్తి ప్రదాత.


Next Story