కరోనా సమయంలోనూ ఆ గ్రౌండ్స్ చాలా బిజీ

by  |
కరోనా సమయంలోనూ ఆ గ్రౌండ్స్ చాలా బిజీ
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా పలు క్రికెట్ లీగ్స్ మాత్రమే కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా వాయిదా పడ్డాయి. గత ఏడాది బీసీసీఐ తమ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 13వ సీజన్‌ను యూఏఈ వేదికగా విజయవంతంగా నిర్వహించింది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలుగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇందుకు గాను ఈసీబీకి బీసీసీఐ దాదాపు రూ. 100 కోట్లు ఫీజుగా చెల్లించింది. అయితే ఈ ఏడాది ఇండియాలోనే ఐపీఎల్ 14వ సీజన్‌ను నిర్వహించాలని బీసీసీఐ లీగ్‌ను ప్రారంభించింది. కాగా కారవాన్ పద్దతిలో నిర్వహించిన ఐపీఎల్ 2021 తొలి విడత ముగిసిన వెంటనే అర్దాతరంగా ముగిసి పోయింది. చెన్నై, ముంబై వేదికలుగా అన్ని జట్లు ఫస్ట్ లెగ్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీలో రెండో విడత మ్యాచ్‌ల కోసం వెళ్లాయి. అక్కడ తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్లలోని క్రికెటర్లు, సిబ్బందికి కరోనా సోకింది. దీంతో బీసీసీఐ వెంటనే ఐపీఎల్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

అందరికీ యూఏఈనే..

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మాత్రమే కాకుండా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) 6వ సీజన్ కూడా వాయిదా పడింది. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులకు అత్యంత సమీపంగా ఉన్న తటస్థ వేదిక యూఏఈ మాత్రమే. దీంతో బీసీసీఐతో పాటు పీసీబీ కూడా యూఏఈ వేదికగా ఐపీఎల్, పీఎస్ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించాయి. పీఎస్ఎల్‌లో మిగిలిన 20 మ్యాచ్‌లు అబుదాబి వేదికగా జరుగనుండగా.. ఐపీఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లు అబుదాబితో పాటు షార్జా, దుబాయ్ వేదికల్లో నిర్వహించాల్సి ఉన్నది. పీఎస్ఎల్ జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుండగా.. ఐపీఎల్ సెప్టెంబర్19 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహిస్తున్నారు. అయితే పీఎస్ఎల్, ఐపీఎల్‌లో మొత్తం 51 టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వరుసగా మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆయా పిచ్‌లు తిరిగి పూర్వ స్థితికి తీసుకొని రావడానికి కనీసం ఒక నెల సమయం పడుతుంది. అయితే… కరోనా కారణంగా ఇండియాలో అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వేదికను యూఏఈకి మార్చాలంటే ఐసీసీ యూఏఈలోని తమ సొంత వేదికలతో పాటు మిగిలిన వేదికలను కూడా రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.

యూఏఈలో ఐసీసీ స్టేడియంలు..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా ఏళ్ల నుంచి తమ న్యూట్రల్ గ్రౌండ్‌గా అబుదాబి స్టేడియంను ఉపయోగించుకుంటున్నది. పాకిస్తాన్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా పలు దేశాల క్రికెట్ జట్లు అక్కడ పర్యటించడానికి నిరాకరించడంతో యూఏఈలో టెస్ట్, పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. యూఏఈలో అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) ప్రధాన కార్యాలయం ఉన్నది. దుబాయ్‌లో ఐసీసీ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అకాడమీలు నిర్మించింది. అక్కడ ఐసీసీకి చెందిన ఇంటర్నేషనల్ స్టేడియంలతో పాటు, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు చెందిన స్టేడియంలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో బీసీసీఐతో పాటు పీసీబీ కూడా యూఏఈని వేదికగా ఎంచుకున్నాయి. మరోవైపు ఇండియాలో కరోనా కారణంగా పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను తరలించాల్సి వస్తే ఐసీసీ మొదటి చాయిస్ యూఏఈ కానున్నది. దీనికి కారణం అక్కడ అందుబాటులో ఉన్న క్రికెట్ స్టేడియంలే కారణం. ఇక యూఏఈలో కరోనా కేసులు తక్కువగా నమోదవడంతో పాటు స్టార్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా లాజిస్టిక్స్ సమస్యలు కూడా తక్కువగా ఉన్నాయి. అందుకే ఐసీసీ నుంచి బీసీసీఐ, పీసీబీ వంటి క్రికెట్ బోర్డులు కూడా యూఏఈ క్రికెట్ గ్రౌండ్స్ కోసం క్యూలు కడుతున్నాయి.


Next Story

Most Viewed