మధ్యప్రదేశ్ ఈ టెండర్ల కుంభకోణం.. ఇద్దరు అరెస్ట్

by  |
మధ్యప్రదేశ్ ఈ టెండర్ల కుంభకోణం.. ఇద్దరు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ ఈ టెండర్ల కుంభకోణం కేసులో ఇద్దరు నిందితులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మంతెన కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ప్రమోటర్ శ్రీనివాస్‌ రాజు మంతెన, భోపాల్‌కు చెందిన ఆదిత్య ఇన్‌ఫ్రా నిర్వహకుడు ఆదిత్య త్రిపాఠి అరెస్ట్ అయ్యారు. వీరిని హైదరాబాద్‌ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని.. కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నిందితులకు ఫిబ్రవరి 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించడంతో అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, ఈ టెండర్ల కుంభకోణంలో శ్రీనివాస్ రాజు కీలక పాత్ర వహించారని.. హవాలా లావాదేవీల కోసమే ఆదిత్య ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు గుర్తించారు.

కాగా, 2018లో మధ్యప్రదేశ్‌ జరిగిన ఈ టెండరింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో.. ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పోర్టల్‌ను హ్యాక్ చేసిన పలు సంస్థలు తక్కువ మొత్తంలో టెండర్లు దక్కించుకున్నాయని వార్తలొచ్చాయి. ఇందులో సుమారు రూ. 3 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులకు ఫిర్యాదు అందడంతో కేసు విచారణ వేగవంతం చేశారు. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన మ్యాక్స్ మంతెన మైక్రో, జీవీపీఆర్ సంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల దృష్య్టా కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు శ్రీనివాస్ రాజు మంతెన, ఆదిత్య త్రిపాఠిని అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed