దర్శకుడు మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

తన సోదరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

దర్శకుడు మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర సోమవారం రాత్రి విజయవాడలో కన్నుమూశారు. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను మెహర్ రమేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. తన సోదరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఓ పోస్ట్ పెట్టారు. చిన్నప్పటి నుంచి తనను ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఒక తల్లిలాగా అండగా నిలిచిందని చెప్పారు. ఇటీవల తన కుమార్తె వివాహాన్ని ఆమె దగ్గరుండి ఎంతో వైభవంగా జరిపించిందని, కొన్ని రోజుల క్రితమే తామందరం కలసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఎంతో సంతోషంగా గడిపామని గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి అయిన అక్క ఇంత త్వరగా తమను వదిలి వెళ్లిపోవడం తీరని లోటని మెహర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె దేవుడి సన్నిధికి వెళ్లిపోయిందనే చేదు నిజాలను తమ కుటుంబం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోందని రాసుకొచ్చారు. ఈ విషాద వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా మెహర్ రమేష్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మెహర్ జ్యోతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. మెహర్ రమేష్ తెలుగులో పలు చిత్రాలు తెరకెక్కించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయారు. ఆయన చివరగా.. ‘భోళా శంకర్’ మూవీ తీశారు. అయితే కీర్తి సురేష్, తమన్నా భాటియా, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.

Next Story