పెద్దపల్లిలో దారుణం.. రూ.50 లక్షలతో వెళ్లి తిరిగిరాని ఇద్దరు..!

by  |
పెద్దపల్లిలో దారుణం.. రూ.50 లక్షలతో వెళ్లి తిరిగిరాని ఇద్దరు..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యం అయ్యారు. కాటారం మండలం గంగారంలో భూమి కొనేందుకు బయలుదేరిన వీరి ఆచూకి లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే… లద్నాపూర్ గ్రామానికి చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు శనివారం కాటారం మండలం గంగారం గ్రామంలో ఇదివరకు కొనుగోలు చేసిన భూమికి డబ్బులు చెల్లించేందుకు వెళ్లారు. గతంలోనే యజమానికి వీరు అడ్వాన్స్‌గా ఇవ్వగా, బ్యాలెన్స్ డబ్బులు రూ.50 లక్షలు ఇవ్వడానికి శనివారం బైక్ పై వెళ్లారు. ఆరోజు నుంచి వీరి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా మంథని మండలం ఖాన్సాయిపేట వద్ద అదృశ్యమైన వారి బైక్ లభ్యమైంది. సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు వీరి కోసం వెతికారు. అంతకుమందు మంథని మండలం ఎక్లాస్ పూర్ సమీపంలోని గాడిదల గండి వద్దకు చేరుకున్న తర్వాత అదృశ్యమైన వారు ఫోన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వెంటాడి వెళ్లారా..?

భూమి కొనుగోలు చేసిన రాజేశం, మల్లయ్యలు రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలు తీసుకెళ్తున్నారని తెలుసుకున్న వ్యక్తులు ఎవరైనా వారిని వెంబడించి గాడిదల గండి దాటగానే అడ్డగించారా? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిద్దరిని అడ్డగించిన అగంతకులు వారి వద్ద ఉన్న రూ.50 లక్షలు లాక్కొని వారిని కొట్టి పడేశారా..? అన్న అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు. బైక్ లభ్యమైన ఖాన్సాయిపేట పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. పక్కా సమాచారం మేరకే గుర్తుతెలియని దుండగలు దాడికి పాల్పడి ఉంటారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, ముందుగా అదృశ్యమైన వారి ఆచూకీ లభ్యమైతే అసలు విషయాలు తెలుస్తాయని రామగిరి ఎస్సై మహేందర్ తెలిపారు.

కాల్ డేటా కోసం..

అదృశ్యమైన వారి మొబైల్ కాల్ డేటా సేకరించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. శనివారం రాజేశం, మల్లయ్యల మొబైల్ నెంబర్లకు ఎవరెవరు ఫోన్ చేశారో తెలిస్తే మిస్సింగ్ కేసు మిస్టరీ వీడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం నాటికల్లా ఇద్దరి అదృశ్యం కేసు మిస్టరీ వీడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Next Story

Most Viewed