‘వజ్రా’న్ని మూలకేసి.. స్క్రాప్‌కు అమ్మేస్తున్నారు

by  |
‘వజ్రా’న్ని మూలకేసి.. స్క్రాప్‌కు అమ్మేస్తున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తుప్పు పట్టిన ‘వజ్రా’న్ని స్క్రాప్‌కు అమ్మేస్తున్నారు. ఏంటి వజ్రాన్ని స్క్రాప్‌‌కు అమ్మడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. డైమండ్‌ షాపులో దొరికే వజ్రాం గురించి కాదు మేము చెప్పేది.. హైదరాబాద్ టూ వరంగల్‌ వరకు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తున్న వజ్రా బస్సు గురించి. అవును ఈ బస్సులను తుక్కు కింద అమ్మేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది.

వజ్రా స్పెషాలిటీ..

వరంగల్ టూ హైదరాబాద్.. చార్జి రూ.300, ఏసీ బస్సు.. సెమీ స్లీపర్ సీటు.. బస్సులోకి ఎక్కగానే ఓ వాటర్ బాటిల్.. ఇదీ వజ్ర బస్సు స్పెషాలిటీ. అయితే, వీటిని తిప్పడం నిర్వహణ భారంగా పరిగణిస్తూ ఆర్టీసీ మూలకేసింది. దాదాపు ఆర్టీసీకి సంబంధించిన 60 ఏసీ బస్సులు ఆయా డిపోలకే పరిమితం చేశారు. దీంతో కనీసం లోకల్‌గా ఎంతో కొంత చార్జి పెట్టి తిప్పితేనైనా వినియోగంలో ఉంటాయని కార్మికులు చెబుతున్నా.. మూలకే పెడుతున్నారు. చివరకు తుప్పు పడుతున్నాయని అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

సుమారు రూ.40 కోట్లతో మినీ వజ్ర బస్సులను కొనుగోలు చేశారు. బస్టాండ్ వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కాలనీల్లోనే బస్సు ఎక్కేందుకు వీలుగా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. నగరం నుంచి ప్రధాన పట్టణాలకు కాలనీల మీదుగా నడిపేందుకు వజ్ర పేరుతో ఏసీ మినీ బస్సు సేవలను ఆర్టీసీ 2017 మే నెలలో ప్రారంభించింది. తొలుత 40, ఆ తర్వాత మరో 20 బస్సులు కొన్నారు. ఒకేసారి లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ముందుగా మెహిదీపట్నం, కుషాయిగూడ, మియాపూర్‌ డిపోలకు వీటిని కేటాయించారు. నగరం నుంచి వరంగల్, నిజామాబాద్‌లకు సర్వీసులు ప్రారంభించారు. ఆ తర్వాత కరీంనగర్, గోదావరిఖనిలకు విస్తరించారు. కండక్టర్, టిమ్‌ యంత్రం లేకుండా నేరుగా ఆర్టీసీ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు.

అయితే, వీటిని ముందుగా బస్టాండ్ల వరకు వెళ్లనీయలేదు. బస్టాండ్లకు వెళ్లకపోవటం పెద్ద మైనస్‌గా మారింది. ఇక గరుడ బస్‌ కంటే దీని టికెట్‌ ధర ఎక్కువగా ఉండటం మరో ప్రధాన ఫిర్యాదు. సిటీ డిపోల నుంచి తొలగించి వరంగల్, నిజామాబాద్‌ డిపోలకు కేటాయించినా తీరు మారలేదు. శ్రీశైలం, యాదగిరిగుట్ట, కర్నూలు లాంటి ప్రాంతాలకు నడిపేందుకు ప్రయత్నాలు చేశారు. కేవలం కాలనీలకే వస్తుందని చెప్పినా.. చివరకు డిపోలకు వెళ్లేలా మార్పులు చేశారు. యాప్‌తో సంబంధం లేకుండా నేరుగా డ్రైవరే టికెట్‌ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేశారు. అయితే కారణాలేమీ తెలియకుండానే.. వాటి రూపంలో రూ.12 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దీంతో కరోనా లాక్‌డౌన్ తర్వాత వాటిని డిపోల్లో మూలకేశారు.

సరుకు రవాణాకు బ్రేక్​

ముందుగా ఆర్టీసీ ఎత్తివేయడం.. ప్రైవేట్​పరం చేసేందుకు ప్రభుత్వం ఆలోచించిందనే విమర్శలున్నాయి. కానీ కార్మికుల ఆందోళనలు వస్తాయనే నేపథ్యంలో సంస్థను కొనసాగించాలని నిర్ణయించిన సీఎం… పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నా ఆర్టీసీ మాత్రం అందిపుచ్చుకోలేకపోతోంది. నగరంలో నష్టాలు మోసుకొస్తున్నాయన్న ఉద్దేశంతో వేయి సిటీ బస్సులను ఉపసంహరించు కోవాలని నిర్ణయం తీసుకుని వాటిని కార్గో సర్వీసులకు కేటాయించారు. తుప్పు పడుతున్న 60 వజ్ర ఏసీ బస్సులను కూడా అధికారులు వాటికే కేటాయించారు. వాటిల్లోని సీట్లను తొలగించి సరుకు రవాణాకు వీలుగా మార్చనున్నారు. కానీ ఖరీదైన ఏసీ బస్సులను సరుకు రవాణాకు మార్చడం అధికారులకు మనసొప్పడం లేదు. అందుకే వాటిని పక్కనపెట్టి ఇక తుక్కు కింద అమ్మేందుకే తీసుకువస్తున్నారు.

విడిభాగాలను తీసేస్తున్నారు

ఆర్టీసీలో ఏసీ బస్సులను 8 నుంచి 10 లక్షల కిలోమీటర్ల వరకు తిప్పుతారు. కానీ ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ వజ్ర బస్సులు కేవలం 2 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. ఆర్టీసీ సూపర్ లగ్జరీ, లగ్జరీ, డీలక్స్ బస్సులను 7 లక్షల కిలోమీటర్లు తిప్పగానే వాటిని ‘పల్లె వెలుగు’ బస్సులుగా మార్చి మరో ఏడెనిమిది లక్షల కిలోమీటర్లు తిప్పుతారు. కానీ వజ్ర బస్సులను మాత్రం కేవలం 2 లక్షల కిలోమీటర్లకే పరిమితం చేశారు. నిర్వహణ భారమంటూ వీటిని పక్కనపెట్టి ఈ ఏసీ బస్సుల నుంచి విడిభాగాలను తొలగిస్తున్నారు. ఇతర బస్సులకు విడిభాగాలను వాడుతున్నారు. ఈ బస్సులను సరఫరా చేసిన కంపెనీ నుంచి సహకారం లేకపోవడం, మెయింటనెన్స్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంపెనీకి పలుమార్లు లేఖలు రాసిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. వీటికి వచ్చే ఆదాయం కంటే నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉందని భావించిన అధికారులు వాటిని పూర్తిగా పక్కన ప పెట్టారు. ఇప్పటికే వరంగల్ రీజియన్‌లోని వజ్ర బస్సుల విడిభాగాలను దాదాపుగా తొలగించారు.


Next Story

Most Viewed