తెలంగాణలో తొలిసారి ఎబోలా కలకలం!.. గాంధీ ఆసుపత్రికి విదేశీ ప్రయాణికుడు

by Prasad Jukanti |   (  Updated:2026-06-04 07:39:07  IST  )

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా లక్షణాలున్న సూడాన్ ప్రయాణికుడిని అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‍కు తరలించారు.

తెలంగాణలో తొలిసారి ఎబోలా కలకలం!.. గాంధీ ఆసుపత్రికి విదేశీ ప్రయాణికుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్ (Ebola) శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) కలకలం రేపింది. ఎబోలా వైరస్ హిస్టరీ కలిగి ఉన్న ఓ విదేశీయుడిని అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయం సుడాన్ దేశం నుంచి వచ్చిన ప్రయాణికుడు మహమ్మద్ గతంలో ఎబోలా వైరస్ బారిన పడ్డాడని గుర్తించారు. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా అతడికి ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎబోలా వార్డులో ఉంచారు. నిర్ధారణ పరీక్షల కోసం అతడి శాంపిల్స్ ను వైద్యులు సీసీఎంబీకి పంపించారు. అయితే ఎబోలా వైరస్ లక్షణాలు కలిగిన వ్యక్తి తెలంగాణలో గుర్తించడం ఇదే తొలిసారి కావడంతో ఈ వ్యవహారం అందరిని ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తోంది.

ప్రభుత్వం పకడ్బందీ చర్యలు:

ప్రస్తుతం ఈ ఎబోలా వైరస్ మధ్య ఆఫ్రికా దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే దీనిని "గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ" (Public Health Emergency of International Concern) గా ప్రకటించింది. రోజుల వ్యవధిలోనే వందలాది అనుమానిత కేసులు నమోదు కాగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారి ఇతర దేశాలకు పాకకుండా సరిహద్దు దేశాలు కూడా హై అలర్ట్ లో ఉన్నాయి. ఈ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. తమ పౌరులకు కీలక ప్రయాణ మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. ప్రస్తుతానికి భారతదేశంలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కానప్పటికీ విదేశీ ప్రయాణీకుల నుంచి వైరస్ మన దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో విమానాశ్రయాలు, ఓడరేవుల్లో నిఘాను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కానర్‌లో ఈ వైరస్ లక్షణాలు కలిగి ఉన్న సూడాన్ ప్రయాణికుడు పట్టుబడ్డాడు.

ఐసోలేషన్‌ నుంచి ఎబోలా పేషంట్ల పరార్‌:

ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ విజృంభణ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ భయంతో అక్కడ ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక కార్యక్రమాలపై స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కాంగోలోని కివులోని కటానా పట్టణంలో ఎబోలా వైరస్ బారిన పడి చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేస్తున్న బృందంపై కొందరు మూక దాడికి పాల్పడ్డారు. దీంతో వారు ఆ డెడ్ బాడీని అక్కడే వదిలేసి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పారిపోయారు. తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తే ఆ వైరస్ తమకూ సోకుతుందనే భయంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఎబోలా వైరస్ సోకిన 11 మంది పేషెంట్లు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో ఐసోలేషన్ కేంద్రాలపై స్థానికులు దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

Next Story