మరో వెయ్యి కోట్లు అప్పు చేసిన టీఎస్ సర్కారు

by  |
మరో వెయ్యి కోట్లు అప్పు చేసిన టీఎస్ సర్కారు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు రాష్ట్రాల ద్రవ్యలోటు అప్పుల సేకరణలో భాగంగా ఓపెన్ మార్కెట్‌లో మంగళవారం బాండ్ల వేలం నిర్వహించింది. స్టేట్ డెవలప్ మెంట్ రుణాలు (ఎస్డీఎల్)గా పేర్కొనే ఈ బాండ్ల వేలంలో తెలంగాణ ప్రభుత్వం రూ.750 కోట్లు అప్పుగా తీసుకుంటుందని తెలుపుతూ ముందుగా ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. సెక్యూరిటీల వేలానికి బిడ్డర్లను ఆహ్వానిస్తూ వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు జారీ చేసింది. తీరా వేలం పాట ముగిసే సమయానికి షెడ్యూలులో ఉన్న తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు అప్పులు తీసుకోలేదు. దీంతో అదనంగా అందుబాటులో ఉన్న రూ.250 కోట్ల రూపాయల బిడ్లను ఆఫర్ చేయగా ఒప్పుకున్న తెలంగాణ సర్కారు మొత్తం రూ.1000 కోట్లు అప్పుగా తీసుకుంది.

కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్రాల విధించిన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లోనే ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 ప్రారంభమైంది. కరోనా ప్రభావంతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలై ఆయా ప్రభుత్వాల ఖజానాలకు ఆదాయం పడిపోవడంతో ఈ సంవత్సరం అవి తీసుకునే ద్రవ్యలోటు అప్పులను షెడ్యూలు కన్నా ముందుగానే తీసుకునేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ఈ అప్పుల్లో భాగంగా తాజా రూ.1000 కోట్లతో కలిపి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ13,500 కోట్ల దాకా బాండ్ల వేలం ద్వారా అప్పుగా తీసుకుంది. ఇటీవల రాష్ట్రాలు తమ జీడీపీలో మరో 2 శాతం దాకా అంటే మొత్తం 5శాతం అప్పు తీసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎమ్ చట్టాన్ని సైతం సవరించింది. దీంతో ముందుగా అనుకున్న రూ.12,500 కోట్లు కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9నెలల్లో రూ.15,051 కోట్ల దాకా అప్పు తీసుకునే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి కలిగింది.

అతి ఎక్కువ కాలానికి అతి తక్కువ వడ్డీ…

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం తీసుకున్న రూ.1000 కోట్ల అప్పును 30సంవత్సరాల తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఇంత దీర్ఘకాలానికి అప్పు తీసుకుంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మదుపర్ల నమ్మకం కారణంగా 30సంవత్సరాలకు కేవలం 6.49 శాతం సంవత్సర వడ్డీకే అప్పు సమకూరింది. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 13సంవత్సరాల కాలానికి 6.49 శాతం వడ్డీకి రూ.1000 కోట్లు తీసుకుంది.


Next Story