- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ESI కార్డుల జారీలో ఏజెన్సీ ఇష్టారాజ్యం.. తప్పుల కార్డులతో దిక్కుతోచని స్థితిలో పారిశుద్ధ్య కార్మికులు
పగలు రాత్రి అనకుండా, ఎండనక వాననక మురికి కాలువలు శుభ్రం చేస్తూ సమాజానికి సేవ చేసే పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు ఎప్పుడు అభద్రతాభావంలోనే ఉంటాయి.

దిశ, ఆలేరు: పగలు రాత్రి అనకుండా, ఎండనక వాననక మురికి కాలువలు శుభ్రం చేస్తూ సమాజానికి సేవ చేసే పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు ఎప్పుడు అభద్రతాభావంలోనే ఉంటాయి. వారికి వచ్చే అరకొర జీతాలతో ఇల్లు గడవడమే కష్టం. అలాంటిది ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే.. కార్పొరేట్ ఆసుపత్రుల మాట పక్కన పెడితే, కనీస వైద్యం చేయించుకోవడానికి కూడా చేతిలో పైసలు ఉండవు. అలాంటి కార్మికులకు కొండంత అండగా నిలవాల్సిన ఈఎస్ఐ కార్డులు ఇప్పుడు కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోయాయి.
ఏజెన్సీ ఇష్టారాజ్యం!
ఆలేరు మున్సిపాలిటీలోని కార్మికులకు కార్డుల జారీ కుమారి కన్సల్టెన్సీ అనే ఏజెన్సీకి అప్పగించారు. భద్రత కల్పించాల్సిన సదరు ఏజెన్సీ, ఈఎస్ఐ కార్డుల జారీలో ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
పేర్లు తప్పుగా ముద్రించడం..
పుట్టిన తేదీలు, కుటుంబ సభ్యుల వివరాలు తారుమారు చేయడం. పెళ్లి అయినప్పటికీ పెళ్లి కాలేదని, పిల్లలు ఉన్న లేనట్టుగా పేర్లు లేకపోవడం. లాంటి తప్పుల తడకలతో కార్డులను ఇష్టమొచ్చినట్టు జారీ చేశారు. దీంతో కార్మికులకు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుకుందామని ఆసుపత్రికి వెళ్తే.. "కార్డులో తప్పులున్నాయి, ఉచిత వైద్యం కుదరదు" అని యాజమాన్యం నిర్మొహమాటంగా వెనక్కి పంపుతుంటే, ఆ కార్మికుల గుండెలు పగిలిపోతున్నాయి. అప్పులు తెచ్చి వైద్యం చేయించుకో లేక, కార్డు ఉండి కూడా వాడుకోలేక ఆలేరు పారిశుద్ధ్య కార్మికులు అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం.
కార్మికులకు భరోసా ఏది?
"సమాజానికి ఆరోగ్యాన్ని పంచే కార్మికుడికి అనారోగ్యం వస్తే పట్టించుకునే నాథుడే లేడా?" ఈ దారుణం అంతా ఆలేరు మున్సిపాలిటీ అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా.. ఆలేరు మున్సిపల్ అధికారులు కళ్లుండి కూడా చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తుండడం అత్యంత విచారకరమని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల తీరు పై మండి పడుతున్నారు.
పర్యవేక్షణ శూన్యం!
ఏజెన్సీ కార్డులు ఎలా ఇస్తోంది, వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని సరిచూడాల్సిన కనీస బాధ్యత మున్సిపల్ అధికారులకు లేదా? కార్మికుల ఆవేదన పట్టదా?: రోజువారీ విధుల్లో కార్మికులను వాడుకోవడం పై ఉన్న శ్రద్ధ, వారి ప్రాణాల రక్షణపై ఎందుకు లేదనే విమర్శలు కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
కార్మికుల జీవితాలతో చెలగాటం!
కార్మికుల జీవితాలతో ఆడుకున్న సదరు ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య కార్మికులకు కేవలం జీతాలు ఇవ్వడం మాత్రమే కాదు.. వారి ప్రాణాలకు భరోసా ఇవ్వడం కూడా మున్సిపాలిటీ బాధ్యత. ఇప్పటికైనా అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి, ఈ పేద కార్మికుల కన్నీళ్లు తుడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉన్నతాధికారులు స్పందించి, తప్పుల తడకగా ఉన్న ఈఎస్ఐ కార్డులన్నింటినీ వెనక్కి తీసుకుని, సరైన వివరాలతో కొత్త కార్డులను తక్షణమే జారీ చేయించాలి. ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.






