ఉపాధ్యాయుడిగా మారిన సూర్యాపేట ఎస్పీ నరసింహ.. విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధన!

by Jakkula.Mamatha |

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మరోసారి తన ఉపాధ్యాయ వృత్తిని గుర్తుచేసుకుంటూ బడిపంతులుగా మారి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు.

ఉపాధ్యాయుడిగా మారిన సూర్యాపేట ఎస్పీ నరసింహ.. విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధన!
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మరోసారి తన ఉపాధ్యాయ వృత్తిని గుర్తుచేసుకుంటూ బడిపంతులుగా మారి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎస్పీ, ఎనిమిదో తరగతి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చుని సాంఘిక శాస్త్రం పాఠాలు బోధించారు. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంశాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించగా, విద్యార్థులు ఆసక్తిగా పాఠాలను విన్నారు. ఎస్పీ బోధనను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోనే తన కుమారుడు రుత్విక్‌ను చదివిస్తున్న జూనియర్ అసిస్టెంట్ హరితను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.

అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారని, విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న విద్య సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా వినాలని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి స్నేహితులను, మంచి పుస్తకాలను ఎంచుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు తమ నైపుణ్యంతో విద్యార్థులకు బోధిస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను సమాజానికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Next Story