- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం.. 'మన స్త్రీ నిధి' యాప్ వినియోగం తప్పనిసరి: జిల్లా కలెక్టర్
జిల్లాలో స్త్రీ నిధి రికవరీని నూరు శాతానికి పెంచడంతో పాటు, రుణాల పంపిణీని నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేసే దిశగా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

దిశ,పెద్దపల్లి: జిల్లాలో స్త్రీ నిధి రికవరీని నూరు శాతానికి పెంచడంతో పాటు, రుణాల పంపిణీని నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేసే దిశగా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం ఆయన అధ్యక్షతన స్త్రీ నిధి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రికవరీ, రుణాల పంపిణీ, డిజిటల్ సేవల వినియోగం, సుస్థిర జీవనోపాధులు, ఆర్థిక క్రమశిక్షణ తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో స్త్రీ నిధి రుణ చెల్లింపులన్నీ ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలోనే జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వసూలైన మొత్తాలన్నీ తప్పనిసరిగా 'మన స్త్రీ నిధి' యాప్ ద్వారానే బదిలీ అయ్యేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నారు. లావాదేవీల్లో పారదర్శకత, వేగవంతమైన సర్దుబాటు, సమగ్ర సమాచార నిర్వహణ కోసం క్షేత్రస్థాయి నుంచి అన్ని దశల్లో ఈ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అక్రమాలకు పాల్పడే వీఓఏ లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే, రుణాలు పొంది సకాలంలో చెల్లించకుండా బకాయి పడుతున్న స్వయం సహాయక సంఘాలపై అవసరమైతే 'రెవెన్యూ రికవరీ చట్టం' ప్రకారం చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రికవరీతో పాటు ఇతర విధుల నిర్వహణలో స్త్రీ నిధి, సెర్ప్, మెప్మా సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని, వారి విధులకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు.
జూన్ నెలాఖరు నాటికి జిల్లాలో రికవరీని 70 శాతానికి, క్రెడిట్ లక్ష్యాన్ని కనీసం 30 శాతానికి చేర్చాలనే లక్ష్యంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. జీవనోపాధి రుణాల మంజూరు పెంచడంతో పాటు, జీరో రికవరీ ఉన్న సంఘాల సంఖ్యను పూర్తిగా సున్నాకు తీసుకురావాలన్నారు. ముఖ్యంగా జూలపల్లి, ఎలిగేడు, పాలకుర్తి, మంథని, ధర్మారం, సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో రికవరీ పనితీరును మెరుగు పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళల సుస్థిర జీవనోపాదుల అభివృద్ధికి స్త్రీ నిధి రుణాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఆర్‌డీవో ఎం. కాళిందిని, ఏడీఆర్‌డీవో రవీందర్, స్త్రీ నిధి ఆర్ఎం ఆర్. దుర్గా ప్రసాద్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి శోభ, కోశాధికారి జి. స్వప్న, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు, వివిధ శాఖల అధికారులు, సెర్ప్, మెప్మా, స్త్రీ నిధి సిబ్బంది, జిల్లా సమాఖ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






