- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మన ఇల్లంతకుంటకు ఏమైంది?’.. అధికార పార్టీలో కలకలం రేపుతున్న కరపత్రం
ఇల్లంతకుంట మండలంలో గత రెండు రోజులుగా “మన ఇల్లంతకుంట మండలానికి ఏమైంది..?” అనే శీర్షికతో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేస్తున్న కరపత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

దిశ, కరీంనగర్ బ్యూరో: ఇల్లంతకుంట మండలంలో గత రెండు రోజులుగా “మన ఇల్లంతకుంట మండలానికి ఏమైంది..?” అనే శీర్షికతో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేస్తున్న కరపత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పదేళ్ల పాటు కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చుట్టూ ఉన్నట్లు ఆరోపిస్తున్న “ఆ ముగ్గురు” వ్యక్తులపై కరపత్రంలో తీవ్ర విమర్శలు గుప్పించారు.పదేళ్ల పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు పదవులు దక్కడం లేదని కరపత్రంలో పేర్కొన్నారు. నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి, కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్లే అవకాశాలను సైతం కొందరు అడ్డుకుంటున్నారని, ప్రశ్నించిన వారిని దూరం పెట్టడం లేదా పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారని కరపత్రంలో ఆరోపించారు.
“ఒక్క దళిత బిడ్డకు పదవి ఇవ్వాలన్నా ఆ ముగ్గురి ఎన్‌ఓసీ అవసరమా?” అంటూ కరపత్రంలో ప్రశ్నించారు. 30 ఏళ్లకు పైగా ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ మండలంలో ఒక బలమైన దళిత నాయకుడిని తయారు చేయలేకపోయారని విమర్శించారు. పాత ఎమ్మెల్యేలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ పరిస్థితిపై ఆలోచించాలని సూచించారు. ఎప్పుడూ పెద్ద పెద్ద భవంతులు, డబుల్ డెక్కర్ ఇళ్లకే పరిమితం కాకుండా పేదల గుడిసెలకు, నిజమైన కార్యకర్తల ఇళ్లకు వెళ్లాలని, అలా చేస్తే వారు జీవితాంతం కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తారని కరపత్రంలో పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని విస్మరించి, అవకాశం వచ్చినప్పుడు మాత్రమే చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా “కార్యకర్తలను కూలీలుగా చూస్తే వచ్చిన ప్రతిసారి రూ.1000 కూలి ఇవ్వండి.. అప్పుడు వారికి పదవి రాకపోయినా బాధ ఉండదు” అంటూ కరపత్రంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. అయితే కరపత్రంలో పదేపదే ప్రస్తావించిన “ఆ ముగ్గురు” ఎవరన్న విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదు. దీంతో మండల కాంగ్రెస్ శ్రేణుల్లో ‘ఇంతకీ ఆ ముగ్గురు ఎవరూ?’ అన్న చర్చ జోరుగా సాగుతోంది. కరపత్రం వెనుక ఎవరున్నారు..? అందులో చేసిన ఆరోపణలపై సంబంధిత నాయకులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు మండల రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.






