కమ్యూనిటీ హాలే అంగన్‌వాడీ కేంద్రం..!

by Jakkula.Mamatha |

ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం దుస్థితి చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

కమ్యూనిటీ హాలే అంగన్‌వాడీ కేంద్రం..!
X

దిశ, ఆళ్లపల్లి: ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం దుస్థితి చూపరులను కంటతడి పెట్టిస్తోంది. సొంత భవనం లేక గ్రామ కమ్యూనిటీ హాల్‌లోనే కేంద్రం నడుస్తోంది. కనీస వసతులు లేక చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ కాలనీలో సుమారు 19 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఈ కేంద్రం పై ఆధారపడి ఉన్నారు. కానీ కేంద్రానికి సొంత భవనం లేదు. కాలనిలో కమ్యూనిటీ హాల్‌లోనే అంగన్‌వాడీ నడుస్తోంది. ఒకే గదిలో వంట, పిల్లలకు పాఠాలు, ఆటలు, గుడ్లు-పాలు పంపిణీ అంతా జరుగుతోంది. వంట చేయడానికి గ్యాస్ ఉన్నా, స్టోర్ రూమ్ లేక సరుకులు మూలన పడేస్తున్నారు. ఆట వస్తువులు, బొమ్మలు భద్రపరిచేందుకు అల్మారాలు లేవు.ప్రభుత్వం పౌష్టికాహారం ఇస్తోంది కానీ కూర్చోడానికి సరైన చోటు లేదు.

వానాకాలం, చలికాలంలో పిల్లలు జబ్బున పడుతున్నారు. మా కాలనీ పిల్లల భవిష్యత్తు ఏంటి?" అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సొంత భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు, గతం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. "స్థలం ఉంది. ప్రపోజల్ పంపాం అని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీలకు పక్కా భవనాలు నిర్మిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. "బడి ఈడు వచ్చేలోపు పిల్లలకు పునాది వేయాల్సిన కేంద్రమే ఇలా ఉంటే ఎలా?" అని ఎస్సీ కాలనీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. మర్కోడు ఎస్సీ కాలనీ అంగన్‌వాడీకి సొంత భవనం మంజూరు చేసి, కనీస వసతులు కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Next Story