మహిళపై దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్..

by Jakkula.Mamatha |

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఓ మహిళా పై ఇటీవల జరిగిన దాడి కేసులో ఊహించని మలుపు తిరిగింది.

మహిళపై దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్..
X

దిశ, మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఓ మహిళా పై ఇటీవల జరిగిన దాడి కేసులో ఊహించని మలుపు తిరిగింది. నమ్మదగిన సమాచారం మేరకు.. పట్టణంలోని ఓ కాలనీలో జూన్ 15న భూ వివాదాల నేపథ్యంలో ఓ మహిళ పై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి గాయపర్చారనే ఫిర్యాదు మేరకు మెట్ పల్లి పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. అదే క్రమంలో గాయాలపాలైన మహిళను ముందుగా చికిత్స నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడినుండి మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

బాధితురాలి హెల్త్ కండిషన్ స్టాభిలైజ్ చేసి ఆపరేషన్‌కు సిద్ధం చేసిన క్రమంలో స్కానింగ్ చేసి చూడగా శుక్రవారం మహిళ తల నుంచి దవడా మార్గంలో బుల్లెట్ ఉందని రోగి బంధువులకు హైదరాబాద్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపి దానిని తొలగించారు. కాగా, బంధువులు వెంటనే మెట్ పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మెట్‌పల్లి ఎస్సై కిరణ్ కుమార్ హైదరాబాద్ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ విషయం పై మెట్ పల్లి సీఐ సురేష్ బాబును వివరణ కోరగా మహిళ శరీరంలో మెటల్ ఆబ్జెక్ట్ ఉన్నది నిజమేనని అయితే అది బుల్లెట్టా కాదా నిర్ధారణ కొరకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మహిళ శరీరంలో నుండి తీసింది కంట్రీ మేడ్ వెపన్ కు సంబంధించిన బుల్లెట్ అని విశ్వసనీయంగా తెలిసింది. దాడికి పాల్పడిన వ్యక్తుల వద్ద బీహార్ కు చెందిన వారు పనిచేస్తుండడంతో వారి సహాయంతో వెపన్ తీసుకువచ్చినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ఏదేమైనా పోలీసుల విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Next Story