ట్రంప్ అకౌంట్‌ను సస్పెండ్ చేసిన ట్విట్టర్..

by  |
Trump
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియాలో మరోసారి చుక్కెదురైంది. ట్రంప్ పోస్టు చేసిన వీడియోను ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్, ట్విటర్‌లు తొలగించాయి. అయితే ఈ విషయంపై ఆ సంస్థలు స్పందిస్తూ… వీడియోలో వివరాలు తప్పుగా ఉండడం వల్లే తొలగించాల్సి వచ్చిందని వెల్లడించాయి. కాగా ట్రంప్ ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పిల్లలకు రోగనిరోధక శక్తి ఉందని.. వారు తిరిగి స్కూళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పారు. ఈ వీడియోనే ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేశారు. దీంతో వీడియోలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి రెండు సంస్థలు పోస్ట్‌ను తొలగించాయి. ట్విట్టర్‌లో ట్రంప్ క్యాంపెయిన్ టీంకు చెందిన టీమ్‌ట్రంప్ అకౌంట్‌ ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ట్రంప్ అకౌంట్ ఆ వీడియోను షేర్ చేసింది.

దీంతో ట్రంప్ అకౌంట్‌ ఆ ట్వీట్‌ను తొలగించేంతవరకు అకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ట్విట్టర్ పేర్కొంది. అయితే ఈ పోస్ట్‌ల తొలగింపుపై ట్రంప్ క్యాంపెయిన్ టీం అధికారి కోర్ట్‌నీ పారెల్లా స్పందించారు. ట్రంప్‌ విషయంలో సోషల్ మీడియా సంస్థలు పక్షపాతం చూపుతున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో ఇప్పటివరకు 2.4 లక్షలకు పైగా పిల్లలు కరోనా బారిన పడ్డారు. మరోపక్క అమెరికా వ్యాప్తంగా 4,973,741 కరోనా కేసులు నమోదుకాగా.. 161,608 మంది మృత్యువాతపడ్డారు.


Next Story