రెచ్చగొట్టిన ట్రంప్.. మండిపడుతున్న గవర్నర్లు

by  |
Trump
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ సమయంలో ఎలా స్పందిస్తారో అర్థం కాదు. అతనిదో విచిత్రమైన స్వభావం అని సన్నిహితులే చెబుతుంటారు. ప్రస్తుతం కరోనా క్లిష్ట కాలంలో ట్రంప్ నిర్లక్ష్యం కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోయిందని పలు మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం దీనికి కారణం చైనా అని.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటూ రోజుకో వింత కారణాన్ని తెరపైకి తెస్తున్నారు. అయితే.. అమెరికాను కరోనా కబలిస్తుండటంతో జాతీయ విపత్తుగా ప్రకటించారు. లాక్‌డౌన్ ప్రకటించి ప్రజలను ఇండ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

‘స్టే ఎట్ హోమ్’కు నిరసనగా ర్యాలీలు..

వైట్ హౌస్ జారీ చేసిన ‘స్టే ఎట్ హోమ్’ నిబంధనను వ్యతిరేకిస్తూ చాలామంది నిరసన ర్యాలీలు తీస్తున్నారు. వెంటనే ఆ నిబంధన ఎత్తేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. కాగా, ఈ ఆందోళనకారుల నిరసనలకు ఏకంగా డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. వారిని సమర్థిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇదంతా కొన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ సమయంలో ఆందోళనకారులకు దేశాధ్యక్షుడే అండగా ఉండటం ఏంటి.. అసలు వారిని రెచ్చగొట్టడంలో ఉద్దేశమేంటని వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్‌లీ ఆరోపణలు గుప్పించారు. వారి ప్రాణాలను కాపాడే ఆంక్షలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

కాగా, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వాళ్లే ఆందోళన చేపడుతున్నారని.. వీరందరికీ మద్దతుగా ట్రంప్ అనుచరులే పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారని.. వీళ్లు కనీసం భౌతిక దూరం కూడా పాటించట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

కాగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్.. ఇటీవల కాలంలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన కొందరు గవర్నర్లతో మాట్లాడారు. అప్పుడు లాక్‌డౌన్ ఆంక్షలను సడలించాలని.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి సహకరించాలని కోరారు. కానీ, దీనికి వాళ్లు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లోనే ఆందోళనలు కొనసాగుతుండటం, వారికి ట్రంప్ మద్దతు పలకడం పలు అనుమానాలకు తావిస్తోంది. మిషిగాన్‌లో కూడా స్టే ఎట్ హోం ఆంక్షలను ఎత్తేయాలని నిరసన కారులు వీధుల్లోకి వచ్చి భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంక్షలు సడలించమని గవర్నర్లు చెబుతున్నారు.

మరోవైపు దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ప్రజలు భారీగా ఆందోళనకు దిగుతారని.. కాబట్టి సాధారణ స్థితికి వచ్చేందుకు లాక్‌డౌన్ నిబంధనలు సడలించాలని ఆయన గవర్నర్లను కోరుతున్నారు. కొందరు గవర్నర్లు మాత్రం ఫెడరల్ ప్రభుత్వ వైఖరి సరిగా లేదని అంటున్నారు. ఇదంతా ట్రంప్ వెనకనుండి ఆడిస్తున్న నాటకమని ఆరోపిస్తున్నారు. కాగా, ట్రంప్ వైఖరిపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను ప్రశ్నించగా ఆయన జవాబు దాటవేశారు. అయితే ట్రంప్ ప్రతిపాదనకు కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ మద్దతు తెలిపారు. ప్రతీ రోజు ఎక్కువ స్థాయిలో కరోనా పరీక్షలు చేపడితే ఆంక్షలు సడలిస్తామని హామీ ఇచ్చారు.

tags: America, Trump, governors, agitators, corona

Next Story

Most Viewed