ట్రూకాలర్ నుంచి గార్డియన్స్ యాప్

by  |
ట్రూకాలర్ నుంచి గార్డియన్స్ యాప్
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా కొత్త నెంబ‌ర్ నుంచి కాల్ వ‌స్తే.. చేసింది ఎవరో తెలుసుకోవడానికి చాలా మంది ఉపయోగించే యాప్ ‘ట్రూ కాలర్’. ఈ క్రమంలోనే రోజుకు స‌గ‌టున 9వేల కోట్ల ఫోన్ కాల్స్‌, మెసేజ్‌ల‌ను గుర్తిస్తున్న ట్రూ కాల‌ర్.. నెల‌కు 300 కోట్ల ఫోన్‌కాల్స్‌ను బ్లాక్ చేస్తోంది. ఇదే క్రమంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్స్‌ను ఇంట్రడ్యూస్ చేస్తుండగా, తాజాగా ఓ సరికొత్త యాప్‌ను రిలీజ్ చేసింది ట్రూకాలర్. ‘గార్డియన్స్ – సేఫ్టీ ఆన్ ది మూవ్’ పేరుతో పర్సనల్ సేఫ్టీ కోసం తీసుకొచ్చిన యాప్.. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ రోజు(గురువారం) నుంచి, యాపిల్ యాప్ స్టోర్‌లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉండనుంది. కాగా గార్డియన్స్ ఫీచర్స్, ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో.. చిన్నారులు, మహిళలు బయటికెళ్తే, మళ్లీ వాళ్లు ఇంటికి సురక్షితంగా తిరిగొచ్చేంత వరకు కుటుంబ సభ్యులు తెగ టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా మహిళా భద్రతా ప్రశ్నార్థకంగా మారిన ఈ రోజుల్లో ‘సేఫ్టీ’ అనేది చాలా ముఖ్యం. ఈ మేరకు ఒంటరి ప్రయాణాలు లేదా బయటకు ఎక్కడికైనా వెళ్లిన సందర్భంలో ఈ గార్డియన్స్ యాప్ ఎంతో ఉపయోగపడనుంది. గార్డియన్స్ యాప్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులను సంరక్షకులు(గార్డియన్స్)గా చేర్చవచ్చు. ఇందుకోసం వారికి రిక్వెస్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే, మన లైవ్ లొకేషన్‌ను వారితో పంచుకోవచ్చు. దీన్నే ‘వాచ్ ఓవర్ మీ’ అంటారు. లైవ్ లొకేషన్‌ను మన గ్రూపులోని సభ్యులతో శాశ్వతంగా షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. దీన్నే ‘ఫరెవర్ షేర్’ అంటారు. గార్డియన్స్ యాప్‌లో ‘నాకు సహాయం కావాలి (I Need Help) అనే బటన్ ఉంటుంది. ఇది మనం ఎంచుకున్న గార్డియన్స్‌‌కు అత్యవసర నోటిఫికేషన్స్‌తో పాటు లొకేషన్ డేటాను సెండ్ చేస్తుంది. అంతేకాదు ఫోన్ స్టేటస్ డేటా, బ్యాటరీ లెవల్, ఫోన్ ప్రొఫైల్ స్టేటస్ వంటి విషయాలను చేరవేస్తుంది.

‘సాధారణంగా అర్ధరాత్రి వరకు ఆఫీస్ పనివేళలు ఉన్న అమ్మాయిలు.. ఆ టైమ్‌లో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే తల్లిదండ్రుల్లో ఓ భయం ఉంటుంది. అందుకే మనం ఎక్కడ ఉన్నామో ఎప్పటికప్పుడు వారికి తెలియజేసేలా గార్డియన్స్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. మూవీకి వెళ్లినా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇంటికి వస్తున్నా.. మన లైవ్ లొకేషన్‌‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ట్రాక్ చేయగలరు. ఇంట్లోని పెద్దలను ట్రాక్ చేయడానికి కూడా ఈ యాప్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఒకవేళ అత్యవసరమైతే.. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వాలంటీర్స్ కూడా అందుబాటులో ఉంటారు. వారికి సమాచారం అందిస్తే.. తగిన సాయం చేస్తారు. వాలంటీర్ల బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతే వారికి స్థానం కల్పిస్తాం’ అని యాప్ నిర్వాహకులు తెలిపారు.



Next Story

Most Viewed