55 స్థానాలకే టీఆర్ఎస్ ఆలౌట్

by  |
55 స్థానాలకే టీఆర్ఎస్ ఆలౌట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీల టార్గెట్ మిస్సయింది. గ్రేటర్‌లో సెంచరీ కొడతామని, 100 స్థానాలూ మావేనంటూ ఊకదంపుడు ప్రచారం చేసి చాలా దూరంలోనే ఆగిపోయారు. గత గ్రేటర్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన టీఆర్‌ఎస్ ​ఈసారి ఘోరంగా వెనుకబడింది. 99 స్థానాలను దక్కించుకుని, ఓ కాంగ్రెస్​ కార్పొరేటర్‌ను పార్టీలో చేర్చుకుని 100 స్థానాల్లో ఉన్న అధికార పార్టీ ఇప్పుడు 55 స్థానాలకే పరిమితమైంది. ముందు నుంచీ సెంచరీ కొడతామంటూ ప్రకటించుకున్న గులాబీ ఊహించని దెబ్బతింది. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చిన ముందస్తు సర్వేలన్నీ తలకిందులయ్యాయి.

గతంలో 99 స్థానాల్లో విజయం సాధించి సొంతంగా మేయర్ స్థానాన్ని దక్కించుకున్నట్లే ఈసారి మజ్లిస్‌తో సహా ఎవరి పొత్తు అవసరం లేదంటూ ప్రచారాన్ని చేసుకుంది. అక్టోబర్‌లో కురిసిన వరదలతో హైదరాబాద్ మొత్తం ఆగమాగమైంది. దీంతో వరద సాయాన్ని పంచి పెట్టారు. ఇదే ఓటు బ్యాంకుగా మారుతుందని అంచనాల్లో మునిగారు. ఆరు లక్షల మందికి రూ.667 కోట్లు పంపిణీ చేశారు. వరద సాయాన్ని ముందుగా విచ్చలవిడిగా.. ఇష్టారీతిన ఇంటికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేపట్టారు. ఈ లెక్కలేసుకున్న గులాబీ దళం 100 స్థానాలపై గురి పెట్టింది. కానీ వరద సాయం పంపిణీలో అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకున్నారు. అసలైన బాధితులకు ఇవ్వకుండా బినామీల పేరుతో సగానికిపైగా నొక్కేశారు. దీనిపై పార్టీకి నివేదిక అందడంతో ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని వేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. వరదసాయాన్ని ఓట్లకు బదలాయించుకున్న గులాబీ పార్టీ గ్రేటర్‌లో 100 స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. కానీ ఇచ్చిన సాయం కంటే వ్యతిరేకతే ఎక్కువైందని ఆ తర్వాత పరిణామాల్లో గుర్తించారు.

మరోవైపు మంత్రి కేటీఆర్ ​మొత్తం గ్రేటర్ బాధ్యతలను మీదేసుకుని ప్రచారం చేశారు. ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత కూడా బాధ్యతలు పంచుకుంది. ఇక మొత్తం1‌‌02 డివిజన్లలో కేటీఆర్ రోడ్ షో చేశారు. ఈ రోడ్​షోలో, మీడియా ఇంటర్వ్యూల్లో 100 స్థానాలు కచ్చితంగా మావేనంటూ చెప్పుకొచ్చారు. అటు మంత్రులు కూడా అదే పాట పాడారు. గ్రేటర్​ఓటర్లు తమ వైపు ఉన్నారని, వరద సాయంతో పాటు సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని ఊహించారు. మంత్రి తలసాని కూడా పలుమార్లు మీడియాపైనే నిందలేశారు. గ్రేటర్‌లో 100 స్థానాలు మావేనంటూ చెప్పుకొచ్చారు. అటు ఎమ్మెల్సీ కవిత కూడా పోలింగ్‌కు ముందు నుంచే సెంచరీ సాధిస్తున్నామంటూ ప్రకటించారు. ఓట్ల లెక్కింపు రోజు కూడా అదే చెప్పారు. గత ఎన్నికల్లో సెంచరీని ఒక్క సీటుతో మిస్​అయ్యామని, ఈసారి సెంచరీ సాధిస్తామంటూ ఒకే పాట పాడారు. కానీ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో సెంచరీకి చాలా దూరంలోనే చతికిలబడ్డారు. సెంచరికీ కనీసం చేరకుండానే.. 55 సీట్ల దగ్గరే గులాబీ గ్రేటర్​దళం ఆలౌట్ అయింది. కారణాలేమైనా గులాబీ వేలం పాట సెంచరీ అందుకోలేకపోయింది. “కేటీఆర్​సార్.. కవితా మేడం.. మీరు సెంచరీ మిస్ కాదు.. మధ్యలోనే ఆగిపోయారంటూ” సోషల్ మీడియా విస్తృతంగా ట్రోల్​చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.


Next Story

Most Viewed