తక్కువ వడ్డీతో నిధుల సమీకరణ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

by Naga Rani Yarlagadda |

సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి.. స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

తక్కువ వడ్డీతో నిధుల సమీకరణ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
X
  • నీటిపారుదల సంస్థలకు ఆర్థిక పునర్వ్యవస్థీకరణ
  • 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక
  • రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి.. స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం కుందన్‌బాగ్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రుణభారం తగ్గించి, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బడ్జెట్‌పై ఆధారపడకుండా సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించేందుకు కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సాగునీటి సంస్థల ఖాళీ భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం లేదా లీజుకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. నిజాంసాగర్‌తోపాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల సాధ్యతను అధ్యయనం చేయాలని సూచించారు.

కొత్త ఆదాయ మార్గాల వల్ల రైతులపై ఎలాంటి అదనపు భారం పడకూడదని స్పష్టం చేశారు. 2022-23తోపాటు పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్థిక సంవత్సరాల చట్టబద్ధ ఆడిట్లను వెంటనే పూర్తి చేయాలని.. ఆడిటర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సుమారు 11 శాతం వడ్డీతో ఉన్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చితే ఏటా సుమారు రూ.250 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉన్నదని అధికారులు వివరించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన రుణ వివరాలు, వడ్డీ, చెల్లింపులు, పనుల పురోగతి, పూర్తి చేయడానికి అవసరమైన నిధులు తదితర అంశాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే.. శాఖకు చెందిన భూములు, ఇతర ఆస్తుల పూర్తి వివరాలను 15 రోజుల్లో సిద్ధం చేసి వనరుల సమీకరణకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ పరిహారానికి ఇప్పటికే విడుదల చేసిన నిధులు ఆలస్యం లేకుండా రైతులకు చేరేలా చూడాలని కూడా ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, ఈఎన్సీ (జనరల్) రమేశ్‌బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story