టీఆర్ఎస్ టీమ్ వర్క్..

by  |
టీఆర్ఎస్ టీమ్ వర్క్..
X

దిశ, శేరిలింగంపల్లి: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సమయం ఎక్కువగా లేకపోవడంతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులతో ప్రచారాన్ని పరిగెత్తిస్తున్నారు. ఆయా డివిజన్లలో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల బలాబలాలు, ఓటర్ల అవసరాలు, ప్రజల అభిప్రాయాలు, సామాజిక వర్గాలు, కుల సమీకరణాలు ఇలా ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ అభ్యర్థుల గెలుపుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ టీం వర్క్ గా ముందుకెళ్తుంది. డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల చైర్మన్లు ఇలా ప్రతీ నాయకుడిని ప్రచారం బాధ్యతలు ఇచ్చింది. మేమేం తక్కువ కాదనట్టు ప్రతిపక్షాలు కూడా పేరున్న నేతలను ప్రచారంలోకి దింపి ఎన్నికల్లో గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నాయి.

టార్గెట్ గ్రేటర్..

గ్రేటర్ ఎన్నికల సమరానికి వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈవారం రోజుల్లో ప్రతీ నిమిషం పార్టీలకు విలువైనదే. ఉన్న ఈకొద్ది సమయాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు అన్ని పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. డివిజన్లలో గెలుపోటములపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇంటింటికీ వెళుతూ ఓటర్లను కలవడం.. పోల్‌ మేనేజ్‌మెంట్‌.. అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహ రచనలో మునిగిపోయాయి. అధికార పార్టీ అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలు వారి భుజాలపై మోపింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తుల ఒడ్డుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత వస్తున్న ఈ ఎన్నికల్లో తమ సత్తాచాటి తమకు తిరుగులేదని చూపెట్టుకునేందుకు టీఆర్ ఎస్ ఇదే అవకాశంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

హైదరాబాద్ లోనే మకాం..

హైదరాబాద్ బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగరవేయలన్న లక్ష్యంతో పనిచేస్తున్న అధికార టీఆర్ ఎస్ అందుకు అనుగుణంగానే పనిచేస్తుంది. అందులో భాగంగా ఛోటామోటా నేతల నుంచి మంత్రుల వరకు అందరికీ బాధ్యతలు అప్పగించి ఒక్కో డివిజన్ కు ఒక్కో బాధ్యున్ని కేటాయించారు. దీంతో ఆయా డివిజన్ల బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులను హైదరాబాద్ రప్పించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లకు సంబంధించి సుమారు 3800 మంది ఆయా జిల్లాల నేతలు తరలివచ్చి ప్రచారం చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు మానిటర్ చేస్తూ అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. పరిస్థితులు బాగాలేని చోట, స్వయంగా వారే రంగంలోకి దిగి ప్రచారం చేస్తూ హామీలు ఇస్తున్నారు.

ఇన్ చార్జిల పనితీరుపై కేటీఆర్ నజర్..

డివిజన్ల వారీగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారని, అక్కడి గెలుపు ఓటములను బట్టి తదుపరి కార్యాచరణ ఉండబోతుందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. బాస్ దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు కాస్త వెనకబడే ఉన్నాయి. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ, బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇతర నాయకులు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార పార్టీ ఉన్న కాస్త సమయాన్ని, అన్ని వనరులను వినియోగించుకుంటూ టీం వర్క్ గా ముందుకు వెళుతోంది.


Next Story