ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వ్యాఖ్యల లోగుట్టు ఏంటి ?

341

దిశ ప్రతినిధి, కరీంనగర్: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అయోధ్య రామాలయంపై వ్యాఖ్యలు చేయడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఆయన నోట ఈ మాటలు యాధృచ్చింకంగానే వచ్చాయా లేక ఆంతర్యం పెట్టుకునే అన్నారా అన్నదానిపై తర్జన భర్జన మొదలైంది. రాష్ట్రమంతా కేటీఆర్ సీఎం అవుతారని డిస్కషన్ చేస్తుంటే కోరుట్ల ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేసి డైవర్ట్ చేశారని అంటున్నారు. చాలాకాలంగా విద్యాసాగర్‌రావు కేబినెట్‌ బెర్త్ ఆశిస్తున్నప్పటికీ సామాజిక వర్గాల కోణంతో ఆయన పేరు పరిశీలించే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. ఆర్టీసీ ఛైర్మన్ పదవి అయినా వస్తుందని ఆశించినా అధినేత మాత్రం అవకాశం కల్పించలేదు. దీంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాసాగర్‌రావు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. ఇదేక్రమంలో త్వరలో కేటీఆర్ సీఎం పీఠం అధిష్టించే అవకాశాలు ఉన్నాయని బాహాటంగానే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే కేటీఆర్ బాధ్యతలు తీసుకునే టైంలో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని భావించే హైకమాండ్ దృష్టిలో పడేందుకే బీజేపీతో పాటు ఎంపీ అరవింద్‌పై విరుచుకుపడే ప్రయత్నంతో సెల్ప్ గోల్ చేసుకొని ఉంటారని అంటున్నారు కొందరు. అలాగే నియోజకవర్గంలో కీలకంగా మారిన మైనార్టీలు టీఆర్ఎస్‌కు దూరం అవుతున్నారని దీనివల్ల రానున్న కాలంలో తీవ్రంగా నష్టపోవల్సి వస్తుందని గుర్తించిన ఆయన అయోధ్య అంశాన్ని తనకు అనుకూలంగా మల్చుకుని విఫలం అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. ఇటీవల కాలంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారని దీంతో తాను కూడా ఘాటైన విమర్శలు చేయాలనుకుని ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఎంపీ అరవింద్‌ లేదా, బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుని డైరక్ట్ అటాక్ చేస్తే బావుండేదని, కానీ రామాలయం నిధుల సేకరణ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అంతు చిక్కకుండా తయారైందంటున్నారు కొందరు.

తాను వ్యక్తిగతంగా మాట్లాడానే తప్ప నాయకత్వానికి తన వ్యాఖ్యలతో సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్తున్నప్పటికీ రాష్ట్ర మంత్రి తలసాని పాల్గొన్న అధికారిక సమావేశంలో మాట్లాడడం పార్టీపై కొంత ప్రభావం చూపిందని చెప్పక తప్పదు. అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం నిధుల సమీకరణ గురించి విద్యాసాగర్‌రావు మాట్లాడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీపై ప్రభావం చూపిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చేఎన్నికల్లో తన వారసున్ని బరిలో నిలపాలన్న ఆలోచనలో ఉన్న ఆయన ఆచితూచి మాట్లాడాల్సి ఉండేనని ఆ ప్రాంత వాసులు సైతం అంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే వ్యాఖ్యల్లో లోగుట్టు ఏంటో అన్నది మాత్రం ఆయనకే తెలుసని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..