టీఆర్‌ఎస్‌కు ‘ఎమ్మెల్సీ’ ఫీవర్​

by  |
టీఆర్‌ఎస్‌కు ‘ఎమ్మెల్సీ’ ఫీవర్​
X

అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవంగా ముందు నుంచీ టీఆర్‌ఎస్ పార్టీకి గ్రాడ్యుయేట్ ఎన్నికలు అచ్చిరావడం లేదనే అపవాదు ఉంది. ఈసారి ఎలాగైనా రెండు స్థానాల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో ఆయా నియోజక వర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్ ఖరారు చేస్తోంది. ఇప్పటికే రెండు కీలక స్థానాల్లో గట్టి దెబ్బ తగలడంతో.. ఈసారి గట్టి పోరుకు సిద్ధమవుతోంది. ‘ఏం చేస్తారో తెలియదు.. గెలిచి తీరాల్సిందే’ అంటూ మంత్రి కేటీఆర్ గులాబీ నేతలకు సంకేతాలిస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలు, సర్కారు తీరుపట్ల యువత, నిరుద్యోగులు, ఉద్యోగవర్గాలు అసంతృప్తిగానే ఉన్నారనే సర్వేల నివేదికలతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఈ స్థానాల్లో పోటీ చేసేందుకే అభ్యర్థులు వెనకాడుతున్నారు. ఎట్టకేలకు వరంగల్ స్థానం నుంచి మళ్లీ పల్లా రాజేశ్వర్‌రెడ్డినే రంగంలోకి దింపుతోంది. ముందుగా వద్దని చెప్పిన పల్లా… సీఎం కేసీఆర్​సూచనలతో తిరిగి బరిలోకి దిగుతున్నారు. ఇటు హైదరాబాద్ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థి దొరకడం లేదు. జీహెచ్‌ఎంసీ మేయర్​బొంతు రామ్మోహన్‌ను పోటీలో దింపేందుకే అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి ఓటమిపాలైన దేవీప్రసాద్ పోటీ చేయనంటూ చెప్పుకొచ్చారు. మరో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు కూడా పోటీకి దూరంగానే ఉంటున్నారు. దీంతో బొంతు రామ్మోహన్ ఎంపిక అనివార్యం కానుంది.

గ్రాడ్యుయేట్స్ ఫెయిల్యూర్స్ భయం

రాష్ట్రంలో 2015లో జరిగిన రెండు గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్‍ నుంచి అధికార పార్టీ క్యాండిడేట్, ఉద్యోగ సంఘాల నేత దేవీ‌ప్రసాద్‍ ఓడిపోయారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి కష్టపడాల్సి వచ్చింది. ఎన్నికలంటేనే తమకు ఎదురే లేదనుకునే క్రమంలో ఇలాంటి ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ పెద్దలు కంగుతిన్నారు. అనంతరం కరీంనగర్‍ గ్రాడ్యుయేట్స్​ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్‍ గౌడ్‍పై కాంగ్రెస్‍ పార్టీకి చెందిన జీవన్‍రెడ్డి విజయం సాధించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్‍ బలపరిచిన అభ్యర్థి పూల రవీందర్ ఓటమి చెందగా నర్సిరెడ్డి గెలిచారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే టీఆర్ఎస్ పార్టీకి ఫెయిల్యూర్‍ రిజల్ట్స్ కళ్లముందు మెదులుతున్నాయి. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్‌ఎంసీలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా ఫలితాలు రావడంతో పరాజయ భయంతో ఉంటున్నారు.

గెలుపు కోసం మంతనాలు

ఎన్నికల్లో తిరుగులేదని భావించిన గులాబీ పార్టీకి ఇప్పుడు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. దుబ్బాకలో ఘోరంగా దెబ్బతిన్నారు. జీహెచ్‌ఎంసీలో కూడా ఊహించినదానికి సగానికే పరిమితమయ్యారు. త్వరలో వచ్చే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ఓటమి భయంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్​ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు రానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్​రెడ్డి ముందుగా పోటీకి ససేమిరా అన్నా.. తప్పని పరిస్థితుల్లో బరిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు సీఎం కోటరీలో పవర్ సెంటర్‌గా ఉన్న పల్లా.. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గెలుపు కోసం మంతనాలు సాగిస్తున్నారు. దాదాపు ఇప్పటికే 30 మంది ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అయితే ఆయా జిల్లాల్లో నెలకొన్న గ్రూపులతో కొంత వ్యతిరేకతే ఎదురవుతోంది. ఈసారి మాత్రం అంతా కలిసి రావాలని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ నేతలతో సమావేశమవుతున్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఇటీవల భేటీ అయ్యారు. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి కూడా పల్లా రాజేశ్వర్​రెడ్డికి వ్యతిరేకంగానే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎర్రబెల్లి ఈసారి కొంత సైలెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

అధిష్ఠానం మల్లగుల్లాలు

ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టభద్రుల స్థానంపై అధికార పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టాలనే అంశాన్ని తేల్చుకోవడం లేదు. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు కూడా నేతలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. వాస్తవంగా టీఆర్‌ఎస్​నుంచి పోటీ చేసేందుకు పోటీలు పడే నేతలు.. ఈ ఎన్నికలకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటుగా.. అంతకు ముందు జరిగిన కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు నేతలను పునరాలోచనలో పడేస్తున్నాయి. కరీంనగర్ స్థానంలో పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్​గౌడ్​ను పోటీకి దింపినా… పరాజయం పాలయ్యారు. ఇక్కడ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ కలిసి రాలేదని స్పష్టమైంది. ఇప్పుడు హైదరాబాద్​స్థానానికి కూడా అదే పరిస్థితి ఎదురుకానుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే గతంలో మేయర్​బొంతు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించినా.. పరిస్థితులు మారుతుండటంతో మళ్లీ వెనకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వచ్చేనెలతో మేయర్ స్థానం నుంచి దిగిపోతున్న నేపథ్యంలో పార్టీ సూచన మేరకు పోటీ చేసి ఓడిపోయినా ఏదైనా అవకాశం ఉంటుందనే ఆశతో పోటీకి దిగుతున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ ఇంకా ఇక్కడ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయ లేదు.

నిరుద్యోగుల్లో వ్యతిరేకత

ఇంకో నెల రోజుల తర్వాత నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్​అధికారంలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, కాంట్రాక్ట్​ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన లేకపోవడం, ఇతర డిమాండ్లు పరిష్కారానికి నోచుకోకపోవడంతో​ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొందని తేలింది. ఈ క్రమంలో ఈ రెండు గ్రాడ్యుయేట్ స్థానాలను గెలుచుకోవడం టీఆర్ఎస్‍ పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. రాబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోని ఫలితాలు కీలకంగా భావిస్తుండంతో.. పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఖర్చుకు వెనకాడట్లేదు. నియోజకవర్గాలు, మండల హెడ్‍ క్వార్టర్స్‌లోని పెద్దపెద్ద ఫంక్షన్‍ హాళ్లలో వందలాది కార్యకర్తలు, యువజన సంఘాలతో మీటింగులతో మంత్రులు, ఎన్నికల ఇన్‌చార్జులను తీసుకువస్తూ లక్షలు వెచ్చిస్తున్నారు.



Next Story

Most Viewed