హుజురాబాద్‌లో ‘కారు’కు రిపేర్ స్టార్ట్.. మనీ కవర్లపై ఫోకస్.!

by  |
హుజురాబాద్‌లో ‘కారు’కు రిపేర్ స్టార్ట్.. మనీ కవర్లపై ఫోకస్.!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ప్రజల్లో ఊహించని రీతిలో వచ్చిన వ్యతిరేకతను నిలువరించేందుకు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్టుగా సమాచారం. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్కో ఓటుకు రూ. 6 వేలు ఇస్తున్నారన్న ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుండి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. తమకు డబ్బులు రాలేదని కొందరైతే, తమకు పంపిన కవర్లలో తక్కువగా వచ్చాయని మరికొందరు ఆందోళనలు చేశారు.

గురువారం మధ్యాహ్నం వరకూ ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలకు అధిష్టానం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేసిన వారి వివరాలను తెలుసుకోవడంతో పాటు కవర్లలో తగ్గిన నగదు ఎంత, ఎవరెవరికి తగ్గించారో అన్న వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లోపాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర బాధ్యులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

పోస్టుమార్టం షురూ..

ఓటర్లకు డైరెక్ట్‌గా అందించిన సీల్డ్ కవర్లను కూడా మాయం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు కావాలనే సీల్డ్ కవర్లు మాయం చేశారన్న విషయంపై అధిష్టానం స్పెషల్ ఆపరేషన్ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. సమగ్రంగా వివరాలు తెలుసుకున్న తరువాత ఈ తతంగంతో సంబంధమున్న వారిపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

లోకల్ లీడర్స్ గుస్సా..

అయితే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై హుజురాబాద్ లోకల్ లీడర్స్ కినుక వహించినట్టు ప్రచారం జరుగుతోంది. తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీ ముఖ్య నాయకులు వ్యవహరించడం పట్ల నిరాశపడ్డట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed