కొలిక్కిరాని చర్ల గులాబీ దళపతి వివాదం..

by  |
charla
X

దిశ, భద్రాచలం : అందరు కూర్చొని చర్చించి చర్లలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీలు వేయాలని స్వయంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చెప్పినా నాయకులు కీలక పదవుల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. పార్టీ ఎస్‌సి సెల్, ఎస్‌టి సెల్, కార్మిక సంఘం నేతల ఎంపిక విషయంలో రెండు గ్రూపుల వారు ఒక అవగాహనకు వచ్చినా కీలకమైన టీఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల విషయంలో మాత్రం లీడర్లు పంతం, పట్టుదలతో వ్యవహరించడంతో గురువారం సాయంత్రం జరిగిన సమావేశం అర్దాంతరంగా ముగిసింది. ఉదయం జరిగిన సమావేశంలో రెండు గ్రూపుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో సాయంత్రం మళ్లీ నాయకులు కూర్చొని చర్ల మండల టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీలను పైనల్ చేయాలని బాలసాని చెప్పినా ఫలితం లేకపోయింది.

దళపతి పదవి కోసం నేతల పోటీ

చర్ల మండల గులాబీ దళపతి పదవి కోసం ఒక వర్గం నుంచి ప్రస్తుత అధ్యక్షుడు సోయం రాజారావు (ఎస్‌టి) రెండవసారి పోటీపడుతుండగా, మరోవర్గం నాయకుడు నక్కినబోయిన శ్రీనివాసయాదవ్ (బీసీ) మొదటిసారి పోటీపడుతున్నారు. ఎక్కువ మంది శ్రీనివాసయాదవ్‌ని సపోర్టు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం ఉదయం జరిగిన మీటింగ్‌‌లో బలప్రదర్శన ఈ విషయం స్పష్టచేసింది. ఇక ప్రధాన కార్యదర్శి రేసులో ప్రస్తుత కార్యదర్శి బండి వేణు (బీసీ), రిటైర్డ్ ఉపాధ్యాయుడు దొడ్డి తాతారావు (బీసీ), మైనార్టీకి చెందిన సయ్యద్ అజీజ్‌లతోపాటు గిరిజన తెగ నుంచి ఇర్పా వసంత్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవి కోసం ఇద్దరు తీవ్రంగా పోటీపడుతున్నందున్నారు. ఒకరిని బిజ్జగించి మరొకరికి పదవి ఇస్తారా లేక ఇద్దరిని పక్కనబెట్టి ఆ సమయానికి పార్టీ జిల్లా పెద్దలు కొత్తవారిని తెరపైకి తెస్తారా అనేది వేచిచూడాలి. కమిటీలన్నీ ఈనెల 20న ప్రకటించే అవకాశాలు ఉన్నందున మండల కమిటీ ప్రతిపాదిత పేర్లుగానీ, అనుబంధ కమిటీలకు ఆమోదించిన పేర్లలో కూడా ఈలోగా కుల సమీకరణలో భాగంగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ బాలసాని ఆశీశ్శులు ఎవరికి..?

టీఆర్ఎస్ పార్టీ చర్ల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిల పదవుల పంపిణీ విషయంలో భద్రాచలం నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావుల ఆశీశ్శులు ఎవరికనేది గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. బాలసాని తన సొంత నిర్ణయంతో అధ్యక్ష, కార్యదర్శిలను ఎంపిక చేస్తారా లేక రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో చర్చించి ఫైనల్ చేస్తారా అనేది గులాబీ నాయకులు, కార్యకర్తలకు అంతుచిక్కకుండా ఉంది. అయితే బాలసాని ఆశీశ్శులు ఎవరికి ఉంటే పదవులు వారినే వరిస్తాయని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. పదవులు ఆశిస్తున్న వారంతా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ వైపు చూస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రూపులుగా విడిపోయి పదవుల కోసం నాయకులు తీవ్రంగా పోటీపడుతూనే మరోవైపు ప్రత్యర్థి గ్రూపుల వాళ్ళను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed