గజ్వేల్ లో రాజుకున్న ‘సోషల్’ రగడ.. ఏకంగా హరీష్ రావునే..

by  |
గజ్వేల్ లో రాజుకున్న ‘సోషల్’ రగడ.. ఏకంగా హరీష్ రావునే..
X

దిశ, గజ్వేల్: వడ్డించే వాడు మనవాడు అయితే ఏ బంతిలో కూర్చున్నా ఒకటే అన్న సామెత గజ్వేల్ పట్టణ తెరాస అధ్యక్ష పదవి నియామకంలో జరిగిందట. ఈ అధ్యక్ష పదవి నియామకం పార్టీలో పెద్ద చిచ్చునే రాజేసింది. ఏకంగా నాయకగణం సోషల్ మీడియా వేదికగా వార్ కే దిగారు. బూతుల పురాణాలు, తిట్ల దండకాలకు శ్రీకారం చుట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీ వాట్సాప్ గ్రూపులన్నీ హోరెత్తిస్తున్నారు. ఓ వైపు నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో పాటు మరో వైపు పదవి ఆశించి భంగ పడ్డ ఉద్యమకారులకు సానుభూతులు వెల్లువెత్తున్నాయి. యుటి బ్యాచ్(ఉద్యమ తెలంగాణా), కు మొండి చేయి చూపుతూ, బిటి బ్యాచ్ (బంగారు తెలంగాణా)కు అందలం ఎక్కించడంలో అసలు ఆంతర్యం ఏమిటా అంటూ గజ్వేల్ తెరాస శ్రేణులు చెవులు కోరుక్కుంటున్నాయి. ఈ పదవి పంచాయతీ ఏకంగా మంత్రి హరీష్ రావు ఇంటి తలుపునే తట్టిందట.

గజ్వేల్ తెరాస పార్టీ అధ్యక్ష పదవీ కాలం కేవలం రెండేళ్ళే, కానీ సుధీర్ఘంగా ఏడు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా వంటేరు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మామిళ్ళ నాగులు ముదిరాజ్ లు పార్టీకి విస్తృత సేవలందించారు. అధ్యక్ష పదవీ కాలం గత మూడు నెలల క్రితమే ముగిసి పోయింది. గోపాల్ రెడ్డి అధ్యక్ష పదవిలో కోనసాగుతూనే కౌన్సిలర్ గానూ గెలుపోందారు. అయితే ఇటీవలే పార్టీ నూతన సభ్యత్వాల నమోదు అనంతరం నూతన అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెరాస అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో ఆశావహులు పోటీ పడి మరీ రాష్ర్టంలో ఎక్కడా లేనంతగా సభ్యత్వ నమోదు చేశారు.

పార్టీ ప్లీనరీ లో లానే పట్టణ అధ్యక్ష మరియు కమిటీ నియామకాలు చేయాలని అధిష్టానం సూచించింది. వార్డు అధ్యక్షుల నియామకం పెండింగ్ లో ఉండగా పట్టణ అధ్యక్షుడిని ఎలా ఎన్నిక చేస్తారని తెరాస సీనియర్ నాయకులు ప్రశ్నించడంతో దానికి బ్రేక్ పడింది. సమన్వయ కమిటీ విషయాన్ని మంత్రి హరీష్ దృష్టికి తీసుకెళ్ళారు. ఆ క్రమంలోనే వచ్చిన హూజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి నూతన అధ్యక్షుడిని ఎన్నుకుందామని వారికి సూచించారు. మరింత గడువు దొరకడంతో పట్టణ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న గోపాల్ రెడ్డితో సహ 11 మంది ఆశా వాహులకు ఆశలు పెరిగాయి. దాంతో వార్డు అధ్యక్షులను, కార్యకర్తలను, సీనియర్ ఉద్యమకారులను, ఉన్నత నాయక గణాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

తాజాగా రెండ్రోజుల క్రితం నవాజ్ మీరా, బోగ్గుల సురేష్ లను అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలుగా నియమిస్తూ మంత్రి హరీష్ రావు, నియమక పత్రం అందజేశారు. దాంతో ఆ ఫోటోలు పార్టీ గ్రూపుల్లో వైరల్ గా మారాయి. దీంతో గజ్వేల్ తెరాసలో ముసలం పుట్టినట్లయ్యింది.


Next Story

Most Viewed