గులాబీపై ప్రత్యేక గురి.. ‘ప్రశ్నించే గొంతుక’ తప్పనిసరి!

by  |
గులాబీపై ప్రత్యేక గురి.. ‘ప్రశ్నించే గొంతుక’ తప్పనిసరి!
X

దిశప్రతినిధి, రంగారెడ్డి : ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తిచూపాలన్నా… సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగితే అధికార పార్టీని నిలదీయాలన్నా ప్రతిపక్షం ముఖ్యపాత్ర పోషించాలి. లేకపోతే ప్రజాప్రతినిధిగా ఎన్నికై శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నించాల్సి ఉంటుంది. అందుకోసం అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము, ధైర్యం నాకుందని ప్రతిపక్ష పార్టీల నేతలు సాధారణంగా మాట్లాడుతుంటారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్ధులందరూ ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష, స్వతంత్రుల అభ్యర్ధులు సైతం ‘‘ప్రశ్నించే గొంతు” నినాదంతోనే ప్రచారం చేస్తున్నారు. అదే నినాదంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసి మల్కాజిగిరి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆ నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారు.

ప్రతి ఒక్కరూ అధికార పార్టీపైనే…

పట్టభద్రుల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీపైనే కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, స్వతంత్రులు దృష్టి సాధించారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మేమున్నామంటే మేమున్నామని కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక గూటి పక్షులని కాంగ్రెస్ అంటుంది. టీఆర్ఎస్‌కు ఆసలైన ప్రతిపక్షం తామేనని, స్థిరత్వం లేని పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ విమర్శిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్టానికి చేసింది ఏమీ లేదని వామపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల కాలం చెల్లిందని, అవకాశవాద రాజకీయాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని స్వతంత్రుల అభ్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఏదీ ఏమైన అధికార పార్టీ, అవకాశవాద పార్టీల నాయకులను ఎదుర్కొవాలంటే ప్రశ్నించే గొంతుకను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని పోస్టర్లు, కరపత్రాలు, సోషల్ మీడియాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకోవడం విశేషం.

ప్రశ్నించే గోతంలతో పనిలేదు..

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలతో పనిలేదని బహిరంగగానే అధికార పార్టీ మంత్రులు, నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడ జరగలేదని… అలాంటప్పుడు ప్రశ్నించే గొంతులతో రాష్ట్రంలో అవసరం లేదని అధికార టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు, అనుచరులకు దిశనిర్ధేశం చేసుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జిగా విచ్చేసిన మంత్రి హరీష్ పార్టీ సన్నాహాక సమావేశంలో పనిచేసే నాయకులను గెలిపించండి.. ప్రశ్నించే వాళ్లకు బుద్ది చెప్పాలని ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులు ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. అధికార పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని… ప్రశ్నించే వాళ్లతో ఒరిగేదీ ఏమీలేదని స్పష్టం చేస్తున్నారు.


Next Story

Most Viewed