ఎండలు మండిపోతున్న వేళ.. కారులో గంటల తరబడి లాక్ చేసిన పెంపుడు కుక్క రెస్క్యూ

by Ramesh Naini |

ఎండలు మండిపోతున్న వేళ ఓ పెంపుడు కుక్కను గంటల తరబడి లాక్ చేసిన కారులోనే వదిలేసిన దారుణ ఘటన అస్సాంలోని గువాహటిలో కలకలం రేపింది. స్థానికులు, రెస్క్యూ సిబ్బంది సకాలంలో స్పందించి కారు అద్దాలు పగులగొట్టి ఆ మూగజీవి ప్రాణాలను కాపాడారు.

ఎండలు మండిపోతున్న వేళ.. కారులో గంటల తరబడి లాక్ చేసిన పెంపుడు కుక్క రెస్క్యూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎండలు మండిపోతున్న వేళ ఓ పెంపుడు కుక్కను గంటల తరబడి లాక్ చేసిన కారులోనే వదిలేసిన దారుణ ఘటన అస్సాంలోని గువాహటిలో కలకలం రేపింది. స్థానికులు, రెస్క్యూ సిబ్బంది సకాలంలో స్పందించి కారు అద్దాలు పగులగొట్టి ఆ మూగజీవి ప్రాణాలను కాపాడారు. డిస్‌పూర్ ప్రాంతంలో జూన్ 2న ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కారులో బందీ అవడంతో.. ఆ కుక్క తీవ్రమైన ఉక్కపోత, డీహైడ్రేషన్‌కు గురై విలవిలలాడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే దానిని బయటకు తీసి, తదుపరి వైద్య చికిత్సలు, సంరక్షణ నిమిత్తం ఓ స్వచ్ఛంద జంతు సంక్షేమ సంస్థకు అప్పగించారు.

మండిపడుతున్న జంతు ప్రేమికులు

డిస్‌పూర్ పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడం వల్లే తాను సకాలంలో కారు వద్దకు రాలేకపోయానని యజమాని వివరణ ఇస్తూ క్షమాపణలు కోరాడు. అయితే, ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘యజమానులను కూడా అదే విధంగా కారులో బంధించాలి’ అని మండిపడుతున్నారు. ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్త అభయ్ బోరా ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాలను అలా కారులో వదిలేసి వెళ్లడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదని, అది అత్యంత క్రూరమైన చర్య అని అన్నారు. కష్టకాలంలో సహాయం అడగలేని మూగజీవాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెంపుడు జంతువులను పార్క్ చేసిన వాహనాల్లో ఒంటరిగా వదిలి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story