పోలీసుల అదుపులో సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే.. స్తంభించిన మొబైల్ సేవలు!

by Naga Rani Yarlagadda |

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కాక్రోచ్ జనతా పార్టీ (cockroach janata party) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను (abhijit dipke) ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే.. స్తంభించిన మొబైల్ సేవలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కాక్రోచ్ జనతా పార్టీ (cockroach janata party) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను (abhijit dipke) ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఈ ముందస్తు చర్య తీసుకున్నారు. అభిజిత్ దిప్కే అరెస్టుతో ఆయన మద్దతుదారులు, పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగడంతో ఢిల్లీ వీధుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ఇంటర్నెట్ సేవలు బంద్

ఈ క్రమంలో ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు అత్యంత పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఇంటర్నెట్ బంద్ కారణంగా ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో మొబైల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచార వ్యవస్థ స్తంభించిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పోలీసుల దిగ్బంధంలో పార్లమెంట్ స్ట్రీట్

మరోవైపు ఆందోళనకారులు పార్లమెంట్ వైపు దూసుకురాకుండా ఉండేందుకు భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పార్లమెంట్ స్ట్రీట్‌ను భారీ బారికేడ్లతో పూర్తిగా మూసివేశారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాలన్నింటినీ భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం అత్యంత కీలకమైన విజయ్ చౌక్, రఫీ మార్గ్, పార్లమెంట్ స్ట్రీట్లు పూర్తిగా పోలీసుల దిగ్బంధంలోనే ఉన్నాయి. పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులను భద్రతా సిబ్బంది గట్టిగా ప్రతిఘటించారు. అక్కడ గుమికూడిన ఆందోళనకారులను పార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకుని, వారిని జంతర్ మంతర్ వరకూ వెనక్కి పంపించివేశారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భారీగా పారామిలటరీ బలగాలు, పోలీసులను మోహరించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Next Story