ఫ్రస్ట్రేషన్‌లో టీఆర్ఎస్.. పరేషాన్‌లో కాంట్రాక్టర్లు!

by  |
ఫ్రస్ట్రేషన్‌లో టీఆర్ఎస్.. పరేషాన్‌లో కాంట్రాక్టర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఓటమి, గ్రేటర్‌లో ప్రతికూల ఫలితాల కారణంగా టీఆర్ఎస్‌‌లో ఫ్రస్ట్రేషన్ మొదలైందా? మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ల వరకు కేడర్ అంతా అసంతృప్తికి గురవుతున్నారా? బాధను ఎవరికి చెప్పుకోలేక వాళ్లలో వాళ్లే మదనపడుతున్నారా..? అంటే స్టేట్ పాలిటిక్స్‌ను నిశితంగా పరిశీలిస్తున్నవారు అవుననే సమాధానమిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలంటే నల్లేరుపై నడకలా సాగుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి నెలరోజుల వ్యవధిలో రెండు ఎలక్షన్లలో గట్టి ఎదురుదెబ్బలు తగలడం, అటు కీలక నేతలు సైతం పార్టీ వీడబోతున్నారన్న ఊహాగానాలతో హైకమాండ్‌ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేల సొంత పనులకు కూడా మోక్షం కలగడంలేదన్న ప్రచారం పైస్థాయిలోనే జరుగుతుండటం గమనార్హం.

గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని చెప్పి, గతంలో కంటే దాదాపు 40 సీట్లు తక్కువ సంపాదించుకున్న టీఆర్ఎస్.. ఆ ఫలితాలను విశ్లేషించుకుంటూ తీవ్ర అంతర్మథనంలో మునిగిపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదేక్రమంలో రాష్ట్రంలో చాలాచోట్ల ఆగిపోయిన నిర్మాణాలకు నిధులు కేటాయించాలని అడిగిన జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం దాటవేత ధోరణే ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ లీడర్‌కు అధిష్టానం వద్ద తగినంత పరపతి లేకుంటే కనీసం ఫోన్ కూడా లిప్ట్‌ చేయట్లేదన్న గుసగసలు వినపడుతున్నాయి. కొందరు మంత్రుల ఫోన్‌కు ప్రభుత్వ పెద్దలు జవాబు ఇవ్వకుండా ‘చూద్దాంలే అన్న.. ఇప్పుడే కదా ఎన్నికలు అయిపోయింది, తర్వాత కేబినెట్ మీటింగ్‌కు వచ్చినప్పుడు వివరంగా మాట్లాడుకుందాం, కాస్తంత టెన్షన్‌లో ఉన్నా, తర్వాత చూద్దాం, కొద్దిగా రిలాక్స్ కానివ్వండి’ అని సర్దిచెబుతున్నట్టుగా తెలుస్తోంది.

దీంతో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లకు మంత్రులు ఏం సమాధానం చెప్పుకోలేక నీళ్లు నములుతున్నారని టాక్. ఇదేక్రమంలో ఎమ్మెల్యేల నియోజకవర్గ పర్యటనల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పెండింగ్ నిధులపై అడిగితే.. ‘కాస్తంత ఓపిక పట్టండి.. ఇప్పుడే రెండు కీలకమైన ఎన్నికలు అయిపోయాయి కదా.. తర్వాత వెంటనే చేసేద్దాం’ అని హామీలిస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిళ్లలో న్యూస్ చక్కర్ల కొడుతోంది. ఇక మినిస్టర్ లేదా ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరకు కాంట్రాక్టర్లు వస్తే, అనుచరుల ద్వారానే మొత్తం విషయాన్ని చెప్పిస్తున్నారని, ఒకవేళ పెద్ద కాంట్రాక్టర్లు, చనువు ఎక్కువ ఉన్నవారైతే కలిసి చాయ్ తాగుతూ మాట్లాడుతున్నారని, కొత్త సంవత్సరంలో చూద్దామని నొప్పించకుండా చెప్పి, తిప్పిపంపుతున్నారని టాక్.

మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి నిధుల విడుదలపై సానుకూల వ్యాఖ్యలు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ గతంలో తెచ్చిన అప్పులకు డబ్బులు సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నారన్న చర్చ నియోజకవర్గ స్థాయిల్లోనూ ఊపందుకుంది. కిందిస్థాయిలో పనిచేసిన కార్మికులకు ఇవ్వాల్సిన పైసలు ఎల్లుబాటు కాక, అటు ప్రజాప్రతినిధుల నుంచి సైతం సంతృప్తికరంగా సమాధానాలు రాక మధ్యలో కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు తెచ్చిన ఫలితం టీఆర్ఎస్ నేతల్లో ఫ్రస్ట్రేషన్ తెస్తే.. అది పరోక్షంగా కాంట్రాక్టర్లను పరేషాన్ చేస్తోందని టీఆర్ఎస్ శ్రేణులే విశ్లేషించుకోవడం విశేషం.



Next Story

Most Viewed