ఓటెందుకు వేయాలి.?

by  |
ఓటెందుకు వేయాలి.?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌లో అధికార పార్టీకి సరికొత్త తిరుగుబాటు ఎదురవుతోంది. ప్రధానంగా వెన్నంటి నడిచిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా ఉద్యోగ వర్గాల నుంచి కూడా మద్దతు కరువవుతోంది. అసలు ఓటెందుకు వేయాలి? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెబితే గంపగుత్తగా ఓట్లేస్తామంటూ ప్రచారానికి వచ్చిన మంత్రులకే ఎదురుప్రశ్నలు వేశారు. దీనికి సమాధానం చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ వర్గాలు వ్యతిరేకించాయి. దీంతో గ్రేటర్​ ఎన్నికల్లో అధికార పార్టీలో గుబులు మొదలైంది.

ఎందుకేయాలి.?

ఉద్యోగ సంఘాలు వ్యతిరేకంగా ఉన్నాయనే సమాచారంతో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అప్రమత్తత చర్యలు చేపట్టింది. ముందుగా హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రిని పంపించింది. స్వామిగౌడ్ ​బీజేపీలో చేరిన మరునాడే సదరు మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సదరు మంత్రికి క్లారిటీ రాలేదు. ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఎలాంటి సంసిద్ధత రాకపోవడం, ఏదైనా సర్దిచెప్పే అధికారం లేకపోవడంతో ఓ ప్రెస్‌మీట్ పెట్టి వచ్చేశారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ​మరో మంత్రిని రంగంలోకి దింపారు. ఉద్యోగ సంఘాలకు, కొంతమంది ఉద్యోగులకు అవసరం వచ్చినప్పుడల్లా వారి తరుపున ఉంటూ ఎంతో కొంత పనులు చేయించే సదరు మంత్రిని రాయబారానికి పంపినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. దీంతో ఓ ఉద్యోగ సంఘం కార్యాలయంలో సమావేశమయ్యారు. చాలా సేపు చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వెల్లడైంది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలి? అనే ప్రశ్న మంత్రి ముందుంచారు. రెండు డీఏలు పెండింగ్​పెట్టారు, పీఆర్సీ ఊసే లేదు, కోత పెట్టిన వేతనాలను విడతల వారీగా వేస్తున్నారు, ఉద్యోగులకు పదోన్నతులు లేనేలేవు, బదిలీలు అసలే లేవు, ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేసేందుకు తెలియకుండానే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరేండ్ల వేదనను వెళ్లగక్కారు.

ప్రధానంగా ఉద్యోగ సంఘాలకు ప్రగతి భవన్‌కు దారి లేదని, అక్కడకు వెళ్లి సమస్యలు చెప్పుకునేందుకు అవకాశమే లేదని, ఏడాది కష్టపడితే ఏదో పండగకో, పబ్బానికో సీఎంను కలిసే అవకాశం వస్తే.. అలా వెళ్లి ఇలా రావడమేనని, కలిసినా ఒక్క సమస్య పరిష్కారం కాలేదంటూ ఒక్కసారిగా ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ పరిణామాలతో సదరు మంత్రితో పాటు ఉద్యోగ సంఘాల కీలక నేతలకు కూడా షాక్ తగిలింది. పరిష్కారం లభించే మార్గాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇన్ని సమస్యలున్నా.. అధికార పార్టీకి ఎలా అండగా ఉంటారని, ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సదరు మంత్రి ముందుగా నీళ్లు నమిలినా.. సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఉద్యోగుల నుంచి ఒకే ప్రశ్న పదేపదే ఉత్పన్నమైంది. అసలు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలంటూ నినాదాలు చేచారు. దీంతో వారిని వారించే ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో సీఎంకు వివరిస్తామని, ఈ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ చెప్పినట్లు ఉద్యోగ నేతలు చెబుతున్నారు.

మమ్మల్ని ఓట్లు అడుగుతారా.?

మరోవైపు ప్రైవేట్ ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రధానంగా ప్రైవేట్ టీచర్ల ఫెడరేషన్ నుంచి ప్రశ్నల వర్షం మొదలైంది. ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో సభ్యులున్న ప్రైవేట్ ఉద్యోగుల సంఘం, ప్రైవేట్ టీచర్ల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మహా సంకల్ప యాత్రను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో చాలా ఓట్లు ఉన్నాయి. అయితే చాలా మంది అధికార పార్టీకి చెందిన సంస్థల్లోనే పని చేస్తున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్​ నేపథ్యంలో వారికి వేతనాలు కూడా ఇవ్వలేదు. ఆర్థిక కష్టాలను ఇంకా అనుభవిస్తున్నారు. ఉద్యోగాలకు పోకుండా, వేతనాలు లేకుండా ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. దీనిపై యాజమాన్యాలను నిలదీస్తే అధికారంలో ఉన్న వారే కావడంతో వేతనాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో వారితో చర్చించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి మళ్లీ రంగంలోకి దిగారు. స్వయంగా సీఎం నుంచే ఆదేశాలు రావడంతో చర్చించేందుకు ప్రయత్నాలు చేసినా.. వారి వైపు నుంచి సమాధానం రావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వానికి విరోధంగా మారిన ప్రైవేట్​ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈసారి మమ్మల్ని ఎలా ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ వర్గాల నుంచి ఊహించని విధంగా షాక్ తగలడంతో అధికార పార్టీకి గుబులు పట్టుకుంది.



Next Story

Most Viewed