‘అంగన్వాడీ’ సెంటర్లను ఎత్తివేసే యోచనలో సర్కార్..? అంధకారంలో టీచర్ల భవిష్యత్!

by  |
‘అంగన్వాడీ’ సెంటర్లను ఎత్తివేసే యోచనలో సర్కార్..? అంధకారంలో టీచర్ల భవిష్యత్!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : స్త్రీ, శిశు మరణాలు అరికట్టడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఐసీడీఎస్ ప్రాజెక్టును నీరు గార్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దేశంలో పౌష్టికాహార లోపం కొట్టొచ్చిన్నట్టు కనిపిస్తోంది. గతేడాది పౌష్టికాహార లోపం సూచీలో వరల్డ్ వైడ్‌గా 94వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 101 స్థానానికి దిగజారింది. ఇలాంటి సమయంలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. తమ పంథాన్ని నెగ్గించుకోవడం కోసం ఇటీవల తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా అంగన్వాడీలను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అద్దె భవనాలకు డబ్బులు చెల్లించలేము.. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సెంటర్లను వెంటనే ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో అంగన్వాడీ టీచర్ల నుంచి అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఒప్పుకోకపోతే సెంటర్లు ఎత్తివేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో 2,707 అంగన్ వాడీ కేంద్రాలు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 2,707 అంగన్వాడీ కేంద్రాలు ఉండేవి. ఇందులో 61,116 మంది చిన్నారులు ఉండగా.. గర్భిణులు, బాలింతలు 45,293 మంది ఉన్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 1,600 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 87,408 మంది లబ్దిపొందుతున్నారు. వికారాబాద్ జిల్లాలో 1,107 కేంద్రాల్లో 22 వేల మంది లబ్ది పొందుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సెంటర్లు, జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామాలకు కేటాయించారు. ప్రస్తుతం ఒక్కో గ్రామంలో రెండు నుంచి నాలుగు సెంటర్లు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుండగా.. కొన్ని తండాలు, గూడెంలలో ఉన్నాయి. మొత్తం జిల్లాలో 2,707 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, ఇందులో 620 అద్దె భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేసే ప్రక్రియను ప్రభుత్వం తెరమీదికి తెచ్చింది. ఇక నుంచి ఆ భవనాలకు అద్దె చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు.

తక్షణమే అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు తరలించాలని టీచర్లకు సబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి తండా, కొత్తపల్లి, తాడిపర్తి గ్రామాల్లోని సెంటర్లను ప్రభుత్వ పాఠశాలకు తరలించాలని అధికారులు సెంటర్ నిర్వహకులకు అల్టిమేటమ్ జారీ చేసినట్టు సమాచారం. లేదంటే సెంటర్ ఎత్తివేయాల్సిన పరిస్థితి వస్తుందని సంకేతాలను ఇస్తున్నారు అధికారులు. అద్దె భవనాలకు డబ్బులు చెల్లించలేమన్న నెపంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యావిధానాన్ని అడ్డు పెట్టుకుని ఈ ప్రక్రియకు తెరలేపిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అంగన్వాడీ కార్మికుల భవిష్యత్తే కాకుండా చిన్నారుల భవిష్యత్ కూడా అంధకారంలోకి వెళ్లనుందని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రశ్నార్థకంగా అంగన్వాడీలు..

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో భవిష్యత్ అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన అంగన్వాడీ కార్మికులు, చిన్నారుల తల్లిదండ్రుల్లో మొదలైంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలను వచ్చే పిల్లల్లో 100 శాతం పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఉన్నారు. తండాలు, గూడెంలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు తరలిస్తే.. రెండు, మూడు కిలో మీటర్ల దూరం చిన్నారులు, బాలింతలు ఎలా పోవాలి. తమ పిల్లల ఆకలి ఎలా తీరేదెట్లా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటికీ పేదోడికి బలవర్థకమైన ఆహారం అందక రక్తహీనత రోగాలతో చిన్నారులు, గర్భిణులు ఎంతో మంది అర్ధంతరంగా ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల 116 ప్రపంచ దేశాల్లో పౌష్టికాహారం పై సర్వే చేయగా పౌష్టికాహారం అందించడంలో వెనకబడిన దేశాల లిస్టులో భారత దేశం 101 స్థానంలో ఉందంటే అర్థం చేసుకోచ్చు. దేశంలో పౌష్టికాహారం లోపంతో ఎంత మంది చిన్నారులు, బాలింతలు మరణిస్తున్నారో.. ఇలాంటి సమయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. గత 46 ఏండ్లుగా పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed