బీజేపీలోకి మాజీ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత..?

by  |
బీజేపీలోకి మాజీ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగి, తాజాగా మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ చేరికతో టీఆర్ఎస్ నుంచి చేరికలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి టీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత కాషాయం కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిలో భాగంగానే బీజేపీ నేతలు సదరు మాజీ మంత్రితో అర్థరాత్రి వరకు సమావేశమై ఢిల్లీ నేతలతో ఫోన్‌లో మాట్లాడించినట్లు తెలుస్తోంది. తెలంగాణ తొలి ప్రభుత్వం కేబినెట్‌లో దాదాపుగా మూడోస్థానంలో కొనసాగిన సదరు మాజీమంత్రి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశ పడ్డారు. కానీ అదే మండలి కోటా నుంచి ఉమ్మడి వరంగల్‌జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్‌కు అవకాశం కల్పించడంపై తీవ్ర నిరాశతో ఉన్నారు.

తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ సెగ్మెంట్ నుంచి తన కూతురుకు టికెట్ అడిగినా ఇవ్వకపోవడంతో పాటు పలు కారణాలతో సదరు మాజీ మంత్రి టీఆర్ఎస్ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నారు. రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు పొందిన సదరు నేత ప్రస్తుతం ఉనికి లేకుండా ఉండటం, గతంలో ఒకే పార్టీలో ఉన్నప్పుడు తనకంటే ప్రాధాన్యం తక్కువ ఉండే నేతకు మంత్రి పదవి ఇవ్వడం వంటి అంశాలతో మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో మాజీమంత్రి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

గతంలోనే పలుమార్లు బీజేపీ నేతలు మంతనాలు జరిపారు. చివరకు గురువారం అర్థరాత్రి వరకు జరిపిన చర్చలతో బీజేపీ నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే ఢిల్లీలోని నడ్డాతో ఫోన్‌లో మాట్లాడించి మాజీమంత్రికి పలు హామీలుకూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో రెండు రోజుల్లోనే గులాబీని వదిలి కమలం అందుకోనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఎమ్మెల్సీ… మాజీ మంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తూ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిస్తామని, పార్టీని వీడొద్దంటూ బుజ్జగిస్తున్నారు. కానీ తాను నిర్ణయం తీసుకున్నానని మాజీమంత్రి కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది.


Next Story