ప్రచారంలో పల్లాకు ఊహించని షాక్

by  |
Palla Rajeshwar Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచింది మొదలు.. మళ్లీ తిరిగి ఏనాడూ నియోజకవర్గ పట్టభద్రులకు కన్పించిన దాఖాలాల్లేవు. నిరుద్యోగ సమస్యను ఏనాడూ మండలిలో గానీ ప్రభుత్వం దృష్టికి గానీ తీసుకెళ్లిన సందర్భాలూ లేవు. దీంతో నిరుద్యోగుల నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈసారి భంగపాటు తప్పేలాలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా నిరుద్యోగ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటుంది. వరంగల్ జిల్లాలోనే పట్టణీకరణ ఎక్కువగా ఉండడం.. పరిశ్రమలు కొంతమేర ఉండడంతో ప్రైవేటు ఉద్యోగాలైనా అందుబాటులో ఉన్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలో ఎటు చూసినా ఎడారి ప్రాంతం తప్ప పరిశ్రమల శాతం చాలా తక్కువ. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా తరపున ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఒకటీకి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నిజానికి ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తాయి. కానీ పల్లా విషయంలో సొంత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ అధిష్టానం మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు నియోజకవర్గం, మండలాల వారీగా బాధ్యులను నియమించారు. ప్రత్యేకంగా సోషల్ మీడియా సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు అడిగే సమయంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొంతమంది ఓట్లు అడిగితే.. కొట్టేంత పనిచేస్తున్నారు. అసలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలో ఒక్క కారణం చెప్పడంటూ నిలదీస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలే కాదు.. నియోజకవర్గ, మండలాల బాధ్యులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తమకు ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చిపెడుతోందని ఎమ్మెల్యేల వద్ద వాపోతున్నారు.

పల్లాకు షాకిచ్చిన మాజీ మండలాధ్యక్షుడు వట్టికూటి..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడలోని వేమూరి ఫంక్షన్ హాల్‌లో ప్రచార సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కోదాడ నియోజకవర్గంలోని పలు మండలాల బాధ్యులు, కీలక నేతలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా చిలుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వట్టికూటి నాగయ్య.. సభా వేదికపై ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిలదీశారు. ‘ఆరేండ్ల క్రితం పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి.. ఆ తర్వాత ఎవర్నీ పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు.’ ఇలా మాట ఇచ్చి ఓటర్లను మేం మోసం చేయలేమంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పూర్తి బాధ్యతలను నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తీసుకుంటేనే.. మేం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేస్తామంటూ బదులిచ్చారు. దీంతో వట్టికూటి నాగయ్యకు మద్దతుగా ఆ సమావేశంలో పాల్గొన్న వారు ఒక్కసారిగా ఈలలు, కేకలు వేయడం గమనార్హం. ఫలితంగా వేదికపై ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మిగిలిన వారంతా ఒక్కసారిగా మౌనం వహించాల్సి వచ్చింది.

టీఆర్ఎస్‌లో టెన్షన్.. వాణీదేవి గెలుపుపై జూపల్లి ఎఫెక్ట్..?


Next Story