టీఆర్ఎస్‌లో టెన్షన్.. వాణీదేవి గెలుపుపై జూపల్లి ఎఫెక్ట్..?

by  |
Jupally Krishna Rao-Dishadaily
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంతో పాటు హైదరాబాద్ నియోజకవర్గాన్ని సైతం గెలుచుకోవాలని టీఆర్ఎస్ పక్కా ప్రణాళిక రచించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేదుఅనుభవం చవిచూసిన టీఆర్ఎస్, గ్రాడ్యూయేట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో ఎంపిక చేసుకున్న అభ్యర్థి మూలంగా టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేగాకుండా సొంత పార్టీ నేతలైనా ఓటు వేస్తారా? లేదా? అనే కొత్త చర్చ మొదలైంది. ఇందుకు అనేక కారణాలు తెరపైకి వస్తున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన అనుచరుల ఓటు ఎవరికి అనేది ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ సందర్భంగా జూపల్లి కృష్ణారావుకు రసీదు పుస్తకాలు ఇవ్వలేదు. దాంతో ఆయన సభ్యత్వ నమోదులో పాలుపంచుకోలేకపోయారు. మాజీ మంత్రిగా పనిచేసినా పార్టీ తరఫున ఎందుకు ఈ అవమానం ఎదురైందో ఆయనకు అంతు చిక్కలేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇందుకు తగిన ప్రతిఫలాన్ని చూపించాల్సిందేనని ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి పెరిగింది. జూపల్లి కృష్ణారావు మనసులో మాట ఎలా ఉన్నా ఆయన అనుచరులు మాత్రం తమ నేతకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకోతున్నారు. పార్టీ అధిష్టానానికి ఈ విషయం అర్థమయ్యే తీరులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనితీరు ఉండాలనే అభిప్రాయంతో ఉన్నారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వాణిదేవికి బదులుగా వేరే అభ్యర్థులకు ఓటు వేయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చిన్నారెడ్డి పోటీ చేస్తున్నందున ఆయనకు మద్దతు ఇవ్వాలనే డిమాండ్ ఆయన అనుచరుల నుంచి బలంగా వినిపిస్తోంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉన్న జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా పార్టీ క్రియాశీల కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి వర్గీయులకే విజయం లభించింది. పార్టీ అభ్యర్థుల గెలుపు ఎలా ఉన్నా జూపల్లి మాత్రం తన అనుచరులను గెలిపించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పార్టీ పట్ల ఉన్న అసంతృప్తి చివరకు వాణిదేవి గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఏ విధంగా చల్లారుస్తారు? చివరికి అది సొంత పార్టీకి చేటు చేయక తప్పదా? కాంగ్రెస్ అభ్యర్థికి ఎంతో కొంత లాభం చేస్తుందా? ఇప్పుడు వీటిపైనే కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. జూపల్లి మాత్రం తన మనసులోని మాటను బైట పెట్టడం లేదు.

కేటీఆర్ సెల్ఫ్ గోల్.. కేసీఆర్ నుంచి అక్షింతలు


Next Story

Most Viewed