రూ. 24.75 కోట్లు వృథా?.. స్టార్క్‌పై వేటు వేసిన కోల్‌కతా

by Dishanational3 |
రూ. 24.75 కోట్లు వృథా?.. స్టార్క్‌పై వేటు వేసిన కోల్‌కతా
X

దిశ, స్పోర్ట్స్ : మిచెల్ స్టార్క్.. ఐపీఎల్-17 వేలంలో ఆటం బాంబులా పేలిన ఈ ఆస్ట్రేలియా పేసర్ తీరా లీగ్‌లో తుస్సుమనిపిస్తున్నాడు. వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతనిపై రూ.24.75 కోట్లు కుమ్మరించింది. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచిన అతను.. భారీ ధరకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఒక్కటి లేదా రెండు మ్యాచ్‌ల్లో మినహా అతను రాణించింది లేదు. వికెట్లు తీయడం పక్కనపెడితే ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 7 మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 6 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. 25 ఓవర్లలో 287 పరుగులు ఇచ్చాడు. ఈ లెక్కన అతను ఓవర్‌కు 11.48 పరుగులు సమర్పించుకున్నాడు. 25 బంతులకు అతను ఒక వికెట్ తీశాడు. ఇప్పటివరకు అతను తీసిన ఒక్కో వికెట్ ధర రూ.4 కోట్లు అన్నమాట. అతని రాకతో బౌలింగ్ దళం బలంగా మారుతుందనుకున్న కేకేఆర్ జట్టుకు స్టార్క్ భారంగా మారాడు.

స్టార్క్‌పై వేటు

ఏడు మ్యాచ్‌లు ఆడిన స్టార్క్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ తీయకపోవడం గమనార్హం. లక్నోపై 3 వికెట్లు, ఢిల్లీపై 2 వికెట్ల ప్రదర్శన మినహా మిగతా మ్యాచ్‌ల్లో దారుణంగా తేలిపోయాడు. దీంతో కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ పంజాబ్‌తో మ్యాచ్‌కు అతనిపై వేటు వేసింది. తుది జట్టు నుంచి తప్పించింది. గత మ్యాచ్‌లో వేలికి గాయం కారణంగా స్టార్క్‌ను తీసుకోలేదని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అయితే, పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ స్టార్క్‌ గురించి మాట్లాడుతూ అతను ఫిట్‌గానే ఉన్నాడని, సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. దీనిబట్టి, పేలవ ప్రదర్శన కారణంగానే అతన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌ల్లో అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువ అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అతనిపై కేకేఆర్ పెట్టిన రూ.24.75 కోట్లు వృథానే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



Next Story

Most Viewed