‘మహిళను తన్నడం అమానుషం’

by  |
‘మహిళను తన్నడం అమానుషం’
X

దిశ, కొత్తగూడెం: పోడు భూముల వివాదం మరోసారి రాచుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లికి చెందిన 130 మంది ఆదివాసీ రైతులు గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సుమారు 300 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం గత కొంత కాలంగా తీరని సమస్యగా మారింది.

ఈ భూమి అటవీ ప్రాంతానిదని అటవీ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కాగా గత 30 ఏళ్లుగా పట్టాలు పొంది కోర్టు స్టే ఆర్డర్‌తో పొలాలు సాగు చేసుకుంటున్నామని, అటవీ అధికారులు కోర్టు స్టేను సైతం లెక్క చేయకుండా ఆదివాసి గిరిజనులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం మొక్కలు నాటేందుకు వచ్చిన ఫారెస్ట్ సిబ్బందిని ఆదివాసీ గిరిజనులు అడ్డుకున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని తోపులాటలకు దారి తీసింది. గిరిజనులు ఎదురుతిరిగి అటవీ అధికారులపై, పోలీసులపై దుమ్మెత్తిపోశారు. అటవీ అధికారులు విధులకు ఆటంకం కలిగించారు. దీంతో తమ విధులను అడ్డుకుంటారా అని కొంత మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

దీనిపై ఆదివాసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర స్పందిస్తూ, అటవీ హక్కుల ప్రకారం… అటవీ భూములపై సర్వాధికారాలు ఆదివాసీలకు ఉంటాయని స్పష్టం చేశారు. కోర్టు స్టే ఆర్డర్‌ను సైతం లెక్కచేయకుండా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులకు ఇదే నిదర్శనం అన్నారు. అడ్డుపడ్డ మహిళను బూటు కాళ్లతో తన్నడం అమానుషం అన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నామని, వెంటనే ఫారెస్ట్ అధికారులు దాడులు మానుకోకపోతే, ఉద్యమానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు. అంతేగాకుండా దాడికి పాల్పడ్డ ఫారెస్ట్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed