వైద్యం దూరమాయె.. వాహనం రాదాయె !

by  |
వైద్యం దూరమాయె.. వాహనం రాదాయె !
X

ఓ వైపు లోకమంతా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. రాబోయే ఉపద్రవాన్ని ఊహించలేమంటూ.. ఈ వైరస్ బారిన పడే వారికి సరిపడా ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక ఆస్పత్రుల నిర్మాణానికి పూనుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితిలో ప్రభుత్వాల కృషి ప్రశంసనీయం. కానీ, దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ.. రవాణా వ్యవస్థకు, వైద్యానికి నోచుకోని ‘గిరిపుత్రుల గోస’ ఈ పాలకులకు పట్టడం లేదన్నది చేదు నిజం. ఇప్పటికీ.. గిరిజన గూడేల్లో స్థానికంగా వైద్యమందదు.. పెద్దాసుపత్రికి పోదామంటే రోడ్డుండదు. పరిస్థితి చేయి దాటితే జోలె కట్టి, మైళ్ళ దూరం మోసుకెళ్లాల్సిందే. అయినా, ఆస్పత్రికి చేరేదాకా వారి ప్రాణాలకు నో గ్యారంటీ. ఈ తరహా ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి గ్రామ పంచాయతీకి ఏడు కిలోమీటర్ల దూరంలోని గిరిజన గూడెంలోని ఓ మహిళకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. అసలే లాక్ డౌన్, పైగా లేని రవాణా వ్యవస్థ, దీంతో ఆ మహిళను గ్రామస్తులు గిరిజన గూడెం నుంచి దగ్గరలోని గ్రామపంచాయతీకి జోలెలో మోసుకుంటూ బయలుదేరారు. అదే సమయంలో మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్టు సమాచారం అందుకున్న ఆశా వర్కర్ ధనలక్ష్మి, ఏఎన్ఎం జ్యోతి, అంగన్ వాడీ టీచర్ దుర్గా సైతం కాలి నడకన వెళ్ళి మార్గ మధ్యలోనే కాన్పు చేశారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉండటంతో గూడెంవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రసవించిన తల్లిని తిరిగి జోలెలోనే గ్రామస్తులు, ముగ్గురు సిబ్బంది కలిసి మోసుకుంటూ ఇంటికి చేర్చారు.

ఈ ఘటనలో తల్లీ బిడ్డలిద్దరూ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ, నిత్యం అభివృద్ధి మంత్రం జపించే పాలకులు ఇప్పటికీ పలు గిరిజన గూడేలకు రవాణా వ్యవస్థ కల్పించకపోవడం దురదృష్టకరం. ఇకనైనా గిరిపుత్రులకు రవాణా, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు చొరవ చూపాలి.

Tags: Tribal village, no hospital, no transportation, women delivery



Next Story

Most Viewed